Saturday, November 15, 2025
Homeలెఫ్ట్‌లో యువరక్తం

లెఫ్ట్‌లో యువరక్తం

- Advertisement -

బీహార్‌లో కొత్త వారికి అవకాశం
విద్యార్థి నాయకులకు ప్రాధాన్యత
పిన్న వయస్సు అభ్యర్థుల్లో ధనుంజయ్‌

పట్నా:వామపక్ష పార్టీలలో యువతరం రాణిస్తోంది. కొత్త వారికి అవకాశం లభిస్తోంది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ యువ నాయకులకు వామపక్ష పార్టీలు టికెట్లు కేటాయించాయి. పిన్న వయస్సు అభ్యర్థులను రంగంలోకి దించాయి. విద్యార్థి నాయకులకు, రైతు`భూ పోరాటయోధులకు ప్రాధాన్యత ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో సీనియర్లకు, యువనేతలకు మధ్య సమతుల్యత చెడిపోకుండా టికెట్ల పంపిణీ జరిగింది. సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌, సీపీఐ, సీపీఎం అభ్యర్థుల సగటు వయస్సు 48.7 ఏళ్లు, 55.6 ఏళ్లు, 56.2 ఏళ్లు చొప్పున ఉన్నది.
జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, తొలి దళిత అభ్యర్థిగా ధనుంజయ్‌(28)ను భోరే స్థానం నుంచి సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రంగంలోకి దించింది. ధనుంజయ్‌ జేఎన్‌యూఎస్‌యూకు మొదటి దళిత అధ్యక్షుడు. కేవలం ఏడాదిన్నర కాలంలో పెద్ద పోటీని ఎదుర్కోబోతున్నారు. 2020 ఎన్నికల్లో తక్కువ ఓట్లతో భోరే స్థానాన్ని సీపీఐ(ఎంఎల్‌) కోల్పోయింది. అతిపిన్న వయస్సు అభ్యర్థుల్లో ధనుంజయ్‌ ఒకరు. దక్షిణ బీహార్‌లోని గయా జిల్లాకు చెందిన ఈయనను అదే స్థానం నుంచి పోటీ చేయించాలని పార్టీ తొలుత భావించింది. కానీ మహాగట్బంధన్‌లో సీట్ల సర్దుబాటులో భాగంగా ఆ స్థానం ఆర్‌జేడీకి వెళ్లింది. భోరే స్థానం నుంచి జితేంద్ర పాశ్వాన్‌ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన వెంటనే ఆయన పాత కేసులో అరెస్టు అయ్యారు. దీంతో గోపాల్‌గంజ్‌ జిల్లా భోరే స్థానం అభ్యర్థిగా ధనుంజయ్‌ పేరును సీపీఐ(ఎంఎల్‌) ప్రకటించింది. మొత్తం 20 మంది అభ్యర్థుల్లో ధనుంజయ్‌తో పాటు ఇద్దరు కొత్త వారున్నారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సోదరి దివ్యా గౌతమ్‌ (34), వ్యవసాయ శాస్త్రవేత్త అనిల్‌ కుమార్‌ (51)కు సీపీఐ(ఎంఎల్‌) అవకాశమిచ్చింది. దివ్యా గౌతమ్‌ తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి అకడమిక్స్‌, సోషల్‌ యాక్టివిజంపై దృష్టి పెట్టారు. దిఘా అభ్యర్థిగా బరిలో నిలిచారు. అనిల్‌ కుమార్‌ శాస్త్రవేత్తగా ఉద్యోగం మానేసి సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ పూర్తిస్థాయి కార్యకర్తగా మారారు. ఆయన పిప్రా నుంచి పోటీ చేస్తున్నారు. మిగతా 17 మంది అభ్యర్థుల్లో 11 మంది ఎమ్మెల్యేలు కాగా నలుగురు యువజన నాయకులు సహా మిగిలిన ఆరుగురిలో గతంలో పోటీ చేసిన వారున్నారు. జేఎన్‌యూఎస్‌యూ మాజీ ప్రధాన కార్యదర్శి సందీప్‌ సౌరవ్‌ (38) పలిగంజ్‌ అభ్యర్థి కాగా అగాయిన్‌ నుంచి శివ ప్రకాశ్‌ రంజన్‌ (40), దుమరాన్‌ నుంచి అజిత్‌ కుమార్‌ సింగ్‌ (39), కల్యాణ్‌పూర్‌ నుంచి రంజిత్‌ కుమార్‌ రామ్‌ (40) పోటీ చేస్తున్నారు. తరారీలో తిరిగి పట్టు సాధించడం కోసం భోజ్‌పూర్‌ భూ పోరాట యోధుడు మదన్‌ చంద్రబన్సీ(45)ని సీపీఐ(ఎంఎల్‌) రంగంలోకి దింపింది.
సీపీఐలో… సీపీఐ అభ్యర్థుల్లో 31 ఏళ్ల మోహిత్‌ పాశ్వాన్‌ మొదటిసారి పోటీ చేస్తున్నారు. ఆయన వైశాలీ జిల్లా పరిషత్‌ పబ్లిక్‌ వర్క్స్‌ కమిటీ చైర్మన్‌, అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) బీహార్‌ శాఖ ఉపాధ్యక్షుడు. కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రతిమా కుమారి దాస్‌కు సీపీఐ(ఎంఎల్‌) మద్దతుతో మోహిత్‌కు గట్టి పోటీ ఉన్నది. బెగుసరాయ్‌ జిల్లాకు చెందిన అభ్యర్థుల్లో 56 ఏళ్ల సూర్యకాంత్‌ పాశ్వాన్‌… బఖారి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, సీపీఐ మద్దతున్న అఖిలభారత దళిత హక్కుల సంఘం నాయకుడు. మరొక సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామ్‌ రతన్‌ సింగ్‌ (75) భూమిహార్‌ బ్రాహ్మణ నాయకుడు. భూమి కోసం రైతుల తరపున పోరాడారు. ఆయన తెఘ్రా అసెంబ్లీ స్థానానికి తిరిగి పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అవదేశ్‌ రాయ్‌ (69) బచ్చవారా నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన 2020 ఎన్నికల్లో 484 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బంకా, కర్ఘహార్‌ అభ్యర్థులు సంజయ్‌ కుమార్‌ (61), మహేంద్ర గుప్తా (53) మాజీ శాసనసభ్యులు. బీహార్‌ షరీఫ్‌ అభ్యర్థి శివకుమార్‌ యాదవ్‌ (48), రaంరaార్పూర్‌ అభ్యర్థి రామ్‌ నారాయణ్‌ యాదవ్‌ (52) కొత్త వారు. మొదటిసారి పోటీలో నిలిచారు.
సీపీఎంలో… ఐదుగురు సీపీఎం అభ్యర్థుల్లో 72 ఏళ్ల రాజేంద్ర ప్రసాద్‌ సింగ్‌ బెగుసరాయ్‌ జిల్లాలోని మతిహాని అభ్యర్థి. ఫిప్రా స్థానం నుంచి 53 ఏళ్ల రాజ్‌మంగల్‌ ప్రసాద్‌ పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ కూడా తమ అభ్యర్థిని నిలబెట్టింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు శ్యామ్‌ భారతి (52) హయాఘాట్‌ నుంచి పోటీ చేస్తుండగా… సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అజయ్‌ కుమార్‌ (55), సత్యేంద్ర యాదవ్‌ (48) విభూతిపూర్‌, మంరిa స్థానాల నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. మొత్తంగా బీహార్‌ ఎన్నికలలో అటు సీనియర్లు, ఇటు జూనియర్లకు వామపక్షాలు అవకాశమిచ్చాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు