అర్జెంటైనా ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ పిలుపు
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటైనాలోని జేవియర్ మిలే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ప్రజా ఉద్యమానికి అర్జెంటీనా కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. నిరసనల్లో పాల్గొంటూ ప్రభుత్వ వ్యయాల్లో కోతలు విధించడం, దేశ సార్వభౌమాధికారాన్ని పణంగా పట్టేయడం, ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడం వంటివి ఖండించింది. ప్రభుత్వ విద్యారంగంపై క్రమంగా దాడులు జరుగుతున్నాయని, జాతీయ విశ్వవిద్యాలయాలకు బకాయిలు చెల్లించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రకటనలో విమర్శించింది. ప్రజలకు విద్యను అందించాల్సిన ప్రభుత్వమే… విశ్వవిద్యాలయాల ఆర్థిక స్థితిని దెబ్బతీస్తున్నదని, ఉన్నత విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టివేస్తోందని తీవ్రస్థాయిలో దుయ్యబట్టింది. ఇలాంటి విధానాలను పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ ప్రకటన వెల్లడించింది. ప్రజలను పేదరికంలోకి నెట్టే విధానాలను ఆక్షేపించింది. ప్రజా పోరాటాలపై అణచివేత, కార్మికులు సృష్టించే సంపదను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తుండటాన్ని విమర్శించింది. శ్రామికుల శ్రమ దోపిడీని ఖండించింది.
ప్రజల హక్కులు, సామాజిక న్యాయం పరిరక్షణకు పోరాటాలను ఉధృతం చేయాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను పరిరక్షించేందుకు, ఉచితంగా నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే డిమాండ్‌తో జరిగిన నిరసనల్లో భాగంగా నిర్బంధానికి గురైన అందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. విద్యా వ్యవస్థను బలహీనపరిచే విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం, విద్యార్థులు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ప్రభుత్వం అనుసరించే ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు సార్వత్రిక సమ్మె చేపట్టాలని పేర్కొంది. విద్య, హక్కులు, సార్వభౌమాధికారం పరిరక్షణ కోసం సమష్టిగా పోరాడాలని అర్జెంటైనా కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది.


