Wednesday, February 18, 2026
Homeతెలంగాణసర్వం సిద్ధం

సర్వం సిద్ధం

- Advertisement -

సీపీఐ శతాబ్ది సభకు ఏర్పాట్లు పూర్తి

కదులుతున్న ఎర్ర సైన్యం
ఖమ్మం అరుణార్ణవం
స్వాగత ద్వారాలు, తోరణాలతో అలంకరణ

విశాలాంధ్ర బ్యూరో` ఖమ్మం: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు సర్వం సిద్ధమైంది. జనవరి 18 ఆదివారం ఖమ్మంలో లక్షలాది మందితో బహిరంగ సభ జరగనుంది. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ జీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభకు ఆహ్వాన సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖమ్మం జిల్లాలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ నిర్వహించని రీతిలో సభ నిర్వహణకు ఆహ్వాన సంఘం తగు ఏర్పాట్లు చేసింది. 60 అడుగుల డిజిటల్‌ వేదికను తయారు చేసింది. సుదూర ప్రాంతం నుంచి కూడా వేదిక కనిపించే రీతిలో తీర్చిదిద్దారు. కళాశాల మైదానంలో విద్యుత్‌ దీపాలు అమర్చారు. వేదిక ముందు 40 వేల మంది కూర్చునే విధంగా కుర్చీలు ఏర్పాటు చేశారు. ముందుభాగంలో జనసేవాదళ్‌ మహిళలు, కేంద్ర నాయకత్వానికి ప్రత్యేక ఏర్పాట్లు సమకూర్చారు. సీపీఐ శతవసంతాల ఉత్సవాల సందర్భంగా ఖమ్మం నగరం మొత్తం ఎర్ర తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టుల ఖిల్లా ఖమ్మం మొత్తం అరుణమయమైంది. స్వాగత ద్వారాలు, నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రదర్శకులు ఇబ్బంది పడకుండా దారి పొడవునా మంచినీటి సౌకర్యం కల్పించారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆహ్వానసంఘం కార్యదర్శి బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేశ్‌, సహాయ కార్యదర్శి జమ్ముల జితేంద్రరెడ్డి, ఆహ్వాన సంఘం బాధ్యులు ఏర్పాట్లను పరిశీలించారు.
మూడు ప్రదర్శనలు
సీపీఐ శతాబ్ది సభ సందర్భంగా ఖమ్మంలో మూడు వైపుల నుంచి ప్రదర్శనలు రానున్నాయి. మొదటి ప్రదర్శన పెవిలియన్‌ మైదానం నుంచి బయలుదేరుతుంది. ఈ ప్రదర్శనకు ముందు భాగాన రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జనసేవాదళ్‌ కార్యకర్తల కవాతు ప్రారంభమవుతుంది. కవాతు వెనక కళాకారుల ప్రదర్శన… ఆ తర్వాత బంజారా, కోయ నృత్యాలు, డప్పు దళాలు, వృత్తిసంఘాల ప్రదర్శన ఉంటుంది. దీనికి బాగం హేమంతరావు నేతృత్వం వహిస్తారు. రెండవ ప్రదర్శన శ్రీశ్రీ విగ్రహం నుంచి ప్రారంభమవుతుంది. వైరా రోడ్డు మీదుగా వచ్చే వాహనాలలో వచ్చిన ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. ఈ ప్రదర్శనకు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కూనంనేని సాంబశివరావు, ఎస్‌కే సాబీర్‌ పాషా, జమ్ముల జితేంద్రరెడ్డి నేతృత్వం వహిస్తారు. మరో ప్రదర్శన ఖమ్మం నయాబజార్‌ కళాశాల నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్రదర్శనలో ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ, పాలేరు నియోజక వర్గాలతో పాటు రైళ్ల ద్వారా వచ్చిన కార్యకర్తలు పాల్గొంటారు. ఈ ప్రదర్శనకు ఏపీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, మహ్మద్‌ మౌలానా, దండి సురేశ్‌ తదితరులు నేతృత్వం వహిస్తారు.
సభకు వచ్చే జాతీయ నాయకత్వం
బహిరంగ సభకు డి.రాజాతో పాటు జాతీయ కార్యదర్శివర్గం, కార్యవర్గం, సమితి సభ్యులు హాజరవుతారు. డి.రాజాతో పాటు అమర్‌జిత్‌ కౌర్‌, బీకే టాంగో, రామకృష్ణ పాండా, అనీరాజా, గిరిశర్మ, కె.ప్రకాశ్‌బాబు, సంతోశ్‌కుమార్‌, సంజయ్‌కుమార్‌, పల్లా వెంకటరెడ్డి, కె.రామకృష్ణ హాజరుకానున్నారు.
రెండు గంటలకు ప్రదర్శన
ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రదర్శన ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఎస్‌ఆర్‌ అండ్‌ జీఎన్‌ఆర్‌ కళాశాల మైదానానికి చేరుకుంటుంది. సభకు డి.రాజాతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు హాజరవుతారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు