Homeవిశ్లేషణసొంతడబ్బా కొంతమానుకు

సొంతడబ్బా కొంతమానుకు

- Advertisement -

చింతపట్ల సుదర్శన్

వెనుక నుంచి పోలీసోడు చేజ్ చేస్తుంటే పరుగెత్తుకు వచ్చే దొంగో డిలా ఉరుకులూ పరుగులూగా వచ్చి అరుగు ఎక్కింది డాగీ. ఏంటి బ్రో ఆ పరుగు ఎనీథింగ్ రాంగ్ అనడిగింది డాంకీ. ఈ మనుషుల్లో ఎవ్రీ థింగ్ రాంగే. నా దారిన నేను వస్తున్నానా మైదానం మొదట్లో ఉండే రెండు ఇళ్ల వాళ్లు గొడవ పడుతున్నారు. చేతులతో కొట్టుకోవడం లేదు కాని నోళ్లు పారేసుకుంటున్నారు అసెంబ్లీలో లీడర్లలాగు. ఆ బూతులు వామ్మోవ్ అవేం బూతులు వినడానికి నాకే అసహ్యమేసి ఏమైతే అవు తుందని ఒక్క అరుపు అరిచా. మా గొడవ మధ్య అమెరి కాకీ ఇరాన్‌కి మధ్య దూరడానికి సాహసం చేసేవాడిలా దూరుతావా అంటూ ఒకడు రాయి విసిరేసేడు. చిన్నప్పుడు గోళీకాయలాడేవాడేమో సూటిగానే వుండి తగలరాని చోట తగిలి వెనక్కి తిరిగి చూడకుండా పరుగెత్తేట్టు చేసింద నుకో అంటూ గోడ కానుకు కూలబడింది డాగీ అలసటతో. భాష లేని మనం గొంత తడారిపోయేట్టు అరుచుకుంటాం కానీ మనుషులు వివిధ రకాల బూతులు చులాగ్గా ఎక్స్‌చేంజి చేసుకుంటారు. మనం తిండి దొరక్క అరుచుకుంటాం. వాళ్లు తిన్నది అరక్క అరుచుకుంటారు.మనకు అవసరమా! దొరికింది తిన్నామా అరుగుమీద పన్నామా అంతే. వాళ్ల బూతులు వినలేక విసుగొచ్చి తల దూర్చి తప్పు చేశా. నాలుక కోయడ మేమిటి, పేగులు తీసి మెళ్లో వేసుకోడమేంటి, పండబెట్టి తొక్కడమేంటి అబ్బబ్బా వినలేకపోయేననుకో అంది డాగీ. యథారాజా తథా ప్రజా అని కదా! వాళ్లను ఏలు కునే మారాజులు అసెంబ్లీలోనూ, పార్లమెంటు లోనూ, ధర్నాల్లోనూ, నిరసన ప్రదర్శనల్లోనూ వాడే బూతులనే వాళ్లూ వాడుకుంటారు. ఎద్దు చేలో మేస్తే దూడగట్టున మేయదు కదా వాళ్ల నోళ్లే నొప్పిపుడ్త్తయి కాని ఈ వేళన్నా కాస్త ఎంగిలి పడ్డావా లేదా అది చెప్పు. నిన్నటిలాగే ఊరంతా తిరిగి అలసిపోయా ఎవళ్లూ ‘జూ’ అని పిలవలేదు. చెత్తబుట్టల్లో ఏమీ చిక్కింది లేదు. చూస్తుంటే ఇక ముందు ముందు తిండానికి ఏమీ దొరక దని దిగులు పుడ్తున్నది, నీలాగా కాగి తాలు నవిలే రోజులు దగ్గరపడుతున్నయి అని పిస్తున్నది అంది డాగీ. నువ్వన్నది నిజమే డాగీ బ్రో నీకే కాదు మను షులకూ రోజులు బాగా ఉండేట్టు లేవు అంటూ అరుగు ఎక్కాడు అబ్బాయి. అదేంటి బ్రదర్ ఈ భూమే మీది కదా ఏలుకునే వాళ్లు మీ వాళ్లే కద. కుక్కలనీ, గాడిదల్నీ ఆఖరుకి కాకుల్నీ కొట్టి తింటారు కదా అంది డాంకీ. నువ్వన్నది నిజమే కావచ్చు కానీ డాంకీ ఇప్పుడు ఎల్‌నినో కారణంగా కరువు వచ్చి జనం తిండికి తిప్పలు వచ్చేట్టుంది అన్నాడు అబ్బాయి. ఎల్‌నినోనా వాడెవడు ట్రంప్ దొర వారిని మించినోడు అంది డాగీ. తల్చుకుంటే వాడినీ ఓ ఆట ఆడుకోగలదు ఇది. మనిషి కాదు మనిషిని అతలాకుతలం చెయ్య గల పవర్ ఉన్న ప్రకృతి వైపరీత్యం ఇది. దీనికారణంగా ఈసారి వర్షాలు పడకపోవడంతో మనుషులకు తిండి గింజల కరువు వచ్చే ట్టుంది. సర్కారు వారు తాగడానికి నీళ్లివ్వ లేని స్థితిలో సాగూలేదు. సాగునీళ్లు లేకపోతే పంటలు హుళక్‌కి అయితే ధరలు కొండెక్కితే అని అబ్బాయి అంటూ ఉంటేనే అవునవును విన్నా బియ్యం ధర కేజీకి రెండు వందలు దాటేట్టు ఉందటగా అంది డాంకీ. న్యూస్ బాగా కనెక్ట్ చేస్తావు అన్నాడు అబ్బాయి. ఏదో నమిలింది చెప్పా అంది డాంకీ. ఊరికే ఒకళ్ల నొకళ్లు దుమ్మెత్తి పోసుకోకుంటే మీ నాయకులు ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవచ్చు కదా అంది డాగీ. ఎక్కడ తీరింది వాళ్లకి కంట్రాక్టర్లతో కుమ్మక్కవడానికి, భూములు ఆక్రమించడానికి ఉద్యో గులతో చెడుగుడు ఆడుకోవడానికి టైంసరి పోవడంలేదు మరి అన్నాడు అబ్బాయి. స్వంతడబ్బా వాయించుకోవడానికి ఇది పొడిచాం అది పొడిచాం ప్రపంచపటంలో ఇక్కడున్నాం అక్కడున్నాం అని గొంతు చించుకోకపోతే రానున్న ముప్పును ముందే అంచనా వేసి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవద్దూ తెలివైన మనుషులు కదా! సాగునీరు, తాగునీరు లేదు అని చేతులు ఎత్తేయడం, మనకన్నా ముందు ఏలినవాడు ముంచి పోయాడనడం దీపముండగానే స్వంత ఇల్లు సద్దుకోడం ఇదేనా మన సర్కారు వాళ్ల నిర్వాకం అంది డాంకీ. చేతులు కాలాక కదా ఆకులు వెదుకుతారు వీళ్లు. ఇప్పుడే అరచుకుంటున్నారు జనం రేపు బిందెడు నీళ్ల కోసం చంపుకుంటారో కోసుకుంటారో అంది డాగీ.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు