Tuesday, December 10, 2024
Homeసౌర విద్యుత్‌ కేంద్రంగా ఏపీ

సౌర విద్యుత్‌ కేంద్రంగా ఏపీ

. ప్రతి ఇల్లూ, కార్యాలయంలో ఉత్పత్తి కావాలి
. వినియోగదారుడికి అదనపు ఆదాయ వనరుగా మారాలి
. పీిఎం సూర్యఘర్‌, కుసుమ్‌ పథకాల ద్వారా గరిష్ఠ లబ్ధి
. పైలెట్‌ ప్రాజెక్టుగా కుప్పంలో అమలు: సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలోని ప్రతి ఇళ్లూ, కార్యాలయం సౌరశక్తిని ఒడిసిపట్టి విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగంలో స్వావలంబన సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రం సౌర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సౌర విద్యుత్‌కు ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలరైజేషన్‌ కార్యక్రమంపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. సౌర విద్యుత్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అవసరమైన ప్రణాళికలు సత్వరం అమల్లోకి తేవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక వాతారవణ పరిస్థితుల కారణంగా సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తితో తిరుగులేని ఫలితాలు సాధించవచ్చని సీిఎం అన్నారు. సోలార్‌ విద్యుత్‌తో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి, సోలరైజేషన్‌ కార్యక్రమంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రజలు తమ ఇళ్లపై సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా ప్రతి వినియోగదారుడు తమకు అవసరమైన విద్యుత్‌ను ఉచితంగా పొందడమే కాకుండా, మిగిలిన విద్యుత్‌తో అదనంగా ఆదాయం పొందే పరిస్థితి రావాలన్నారు. దీని కోసం ప్రజలను చైతన్య పరిచి, కేంద్ర కార్యక్రమాలయిన పీిఎం సూర్యఘర్‌, కుసుమ్‌ పథకాలను వారికి చేరువ చేయాలని అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. ప్రజల ఇళ్లపై సౌర విద్యుత్‌ ఉత్పత్తి, 100 శాతం సౌర విద్యుత్‌ గ్రామాలు ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ ఇళ్లపై 100 శాతం సోలార్‌ విద్యుత్‌ పరికరాల ఏర్పాటు, పూర్తిస్థాయి సోలరైజేషన్‌లో భాగంగా కుప్పాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని చేపట్టే పనులపై అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తి స్థాయిలో సౌరవిద్యుత్‌ వినియోగంలోకి తెచ్చే అంశంపైనా అధికారులు సాధ్యాసాధ్యాలను వివరించారు. కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలనూ వివరించారు.
భారీ ఎత్తున కేంద్ర సబ్సిడీ
పీఎం సూర్య ఘర్‌`ముఫ్త్‌ బిజిలీ పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ ప్రారంభించగా, ఏడాదిలో కోటి గృహాలు ఈ పథకం పరిధిలోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా, 30 లక్షల ఇళ్లలో ఈ పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. సోలార్‌ రూఫ్‌ టాప్‌ అమర్చుకునే గృహ విద్యుత్‌ వినియోగదారులకు కేంద్రం భారీగా సబ్సిడీ ఇస్తోందని, 1 కిలో వాట్‌కి ఎస్‌ఆర్టీ (సోలార్‌ రూఫ్‌ టాప్‌) కి రూ.50 వేలు ఖర్చు అవుతుండగా, రూ.30 వేలు సబ్సిడీ రానుంది. అలాగే 2 కిలో వాట్లకు వ్యయం రూ.1 లక్ష కాగా సబ్సిడీ రూ.60 వేలు, 3 కిలో వాట్లకు పెట్టుబడి రూ.1 లక్షా 45 వేలు కాగా, రూ.78 వేలు సబ్సిడీ రూపంలో కేంద్రం ఇస్తుందని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో ఈ పథకానికి తమ సమ్మతి తెలుపుతూ ఇప్పటివరకు 6,33,045 మంది గృహ విద్యుత్‌ వినియోగదారులు నమోదు చేసుకున్నారని అధికారులు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో 50,314 ఇళ్లు సౌర విద్యుత్‌ అమర్చేందుకు అనుకూలంగా ఉండగా, 50,312 ఇళ్ల యజమానులు తమ అంగీకారం తెలిపారు. దీంతో కుప్పం నియోజవర్గంలో 2 కోట్ల 66 లక్షల 15 వేల 521 చదరపు అడుగుల విస్తీర్ణంలో సోలార్‌ రూఫ్‌ టాప్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం లభిస్తుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు