Homeసంపాదకీయంస్వయంప్రతిపత్తికి గ్రహణం!

స్వయంప్రతిపత్తికి గ్రహణం!

- Advertisement -

భారత ప్రజాస్వామ్య సౌధానికి ఎన్నికల సంఘం ఒక మూలస్తంభం. మూలస్తంభమంటే అదేదో కాషాయ పోస్టర్లు అంటించుకునే సున్నం లేని గోడ కాదు. అదొక బలమైన వ్యవస్థ. 1952 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి 2014 వరకు సజావుగా, నిజాయితీగా, నిక్కచ్చిగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసిన ఓ గొప్ప వ్యవస్థ. ఆ తర్వాత నిజంగానే అది కాషాయ పోస్టర్లు అంటించుకునే గోడగా మారిపోయింది. రాజ్యాంగంలోని 324వ అధికరణం ద్వారా సమకూరిన స్వయంప్రతిపత్తి, నిష్పాక్షికతే ఈ వ్యవస్థకు అసలైన బలం. అయితే, ఇటీవల బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు సంబంధించి ఫారం6 మార్పులపై సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన తీవ్ర ఆగ్రహం ఎన్నికల కమిషన్ (ఈసీ) పనితీరుపై, దాని చుట్టూ అలుముకున్న రాజకీయ నీడలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. న్యాయస్థానం ఆమోదించని మార్పులను తాము స్వయంగా ప్రవేశపెట్టి, దానికి సుప్రీంకోర్టు ఆమోదముద్ర ఉందంటూ సెప్టెంబరు 26న బహిరంగ ప్రకటన చేయడం సాధారణ తప్పిదం కాదు... ఇది న్యాయవ్యవస్థను ధిక్కరించడమే కాక, దేశ ప్రజలను పచ్చిగా తప్పుదోవ పట్టించడమే. ఫారం6 వివాదం చట్టబద్ధతను కాలరాసిన ఏకపక్ష ధోరణికి నిదర్శనం. భారతదేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించే ప్రధాన సాధనం ఫారం6. ఓటు హక్కు ప్రాథమిక హక్కు కాకపోయినా, అది రాజ్యాంగం కల్పించిన పరమహోన్నత ప్రజాస్వామిక హక్కు. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఓటర్ల నమోదు నిబంధనల ప్రకారం ఏదైనా మార్పు చేయాలంటే తగిన చట్టబద్ధమైన ప్రక్రియ, విస్తృత సంప్రదింపులు, నిబంధనల సవరణ అనివార్యం. కానీ ఎన్నికల సంఘం ఎటువంటి చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించకుండా ఫారం6లో ఏకపక్షంగా సవరణలు చేసింది. అంతటితో ఆగకుండా, తాము చేసిన సవరణలను సమర్థించుకోవడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం పేరును వాడుకోవడం అత్యంత దిగ్భ్రాంతికరం. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసినట్లుగా` బీహార్ ఎస్‌ఐఆర్ తీర్పు సమయంలో ఆ కొత్త ఫారం ఉనికిలోనే లేదు, దానికి కోర్టు ఎలాంటి ఆమోదమూ తెలుపలేదు. రికార్డులను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించాల్సి రావడం ఎన్నికల కమిషన్ ప్రతిష్టను ఎంతగా దిగజార్చిందో స్పష్టం చేస్తోంది. దేశంలో ఎన్నికల పవిత్రతను కాపాడాల్సిన రాజ్యాంగ సంస్థే ఇటువంటి అవాస్తవాలను ప్రచారం చేయడం ప్రజల్లో విశ్వసనీయతను తుంగలో తొక్కడమే. ఓటు హక్కుపై పరోక్షంగా అడ్డంకులు కల్పించడం అవాంఛనీయం. ఓటర్ల నమోదును సరళతరం చేయాల్సింది పోయి, ఫారాలలో సంక్లిష్టమైన మార్పులు తీసుకురావడం వెనుక ఆంతర్యమేమిటి ? బీహార్ వంటి రాష్ట్రాల్లో వలస కార్మికులు, నిరుపేదలు, అణగారిన వర్గాలు ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవడం ఇప్పటికే అనేక సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. అదనపు నిబంధనలు, ధ్రువీకరణ పత్రాల పేరుతో అర్హులైన పౌరులను ఓటర్ల జాబితా నుంచి దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలకు ఈసీ తీరు బలం చేకూరుస్తోంది. ఓటర్ల హక్కులను పరిరక్షించాల్సిన వ్యవస్థే, వారి నమోదు ప్రక్రియకు అవరోధాలు సృష్టించేలా వ్యవహరించడం శోచనీయం. స్వతంత్ర వ్యవస్థలను అధికార నీడలు ఆవహించడం ఒకింత ప్రమాదకరమే. అందుకే, ఈ మొత్తం ఉదంతాన్ని ఎన్నికల సంఘం చేసిన ఒక సాంకేతిక లోపంగా మాత్రమే చూడలేం. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు, వ్యవస్థలను తమ అధీనంలోకి తెచ్చుకోవాలనే అధికార దాహానికి ఇది తాజా నిదర్శనం. గత కొన్నేళ్లుగా భారతదేశంలో స్వతంత్ర రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తి క్రమంగా కనుమరుగవుతోంది. సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్‌ల నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే ఇందుకు మొదటి అడుగు. ఎన్నికల కమిషనర్‌ల నియామకంపై కార్యనిర్వాహక వర్గానికే పూర్తి ఆధిపత్యం ఉండేలా మార్పులు చేసినప్పుడే స్వతంత్ర వ్యవస్థల అస్తిత్వానికి ముప్పు వాటిల్లింది. ఎన్నికల సంఘం నేడు పాలకపక్షం కనుసన్నల్లో పనిచేసే ఒక విభాగంలా మారుతోందన్న ఆరోపణలు నానాటికీ బలపడుతున్నాయి. ప్రతిపక్షాలపై కఠినంగా వ్యవహరిస్తూ, అధికార పక్ష నేతల విద్వేష ప్రసంగాలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఉదాసీన వైఖరి ప్రదర్శించడం అనేక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఏకంగా న్యాయస్థానం పేరును వాడుకుంటూ ఓటర్ల నమోదు నిబంధనలను తమకు అనుకూలంగా మార్చే స్థాయికి ఈసీ దిగజారడం వెనుక అధికార కేంద్రం అండదండలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. రాజ్యాంగ వ్యవస్థలను విధేయతా కేంద్రాలుగా మార్చే ఈ నియంతృత్వ ధోరణి ప్రజాస్వామ్యపు మూలాలనే దెబ్బతీస్తోంది.ఈ క్లిష్ట తరుణంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించిన తీరు, వేసిన ప్రశ్నలు కొంతమేరకు ఊరట కలిగిస్తున్నాయి. “సుప్రీంకోర్టు తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయి” అని సీజేఐ స్పష్టం చేయడం, అధికార పక్షపు నియంత్రణలకు న్యాయవ్యవస్థ లొంగిపోలేదన్న నమ్మకాన్ని ప్రజల్లో రేకెత్తిస్తోంది.
బహుశా ‘బొద్దింకల’ దూకుడు, ప్రతిపక్షాలు రగిల్చిన నిపðరవ్వల సెగలు ఇందుకు పరోక్ష కారణాలు కావచ్చు. తప్పుడు ప్రకటనలు చేసి కోర్టును అడ్డం పెట్టుకోవాలని చూసిన అధికారులను గుర్తించి, వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు న్యాయస్థానంపై ఉంది. ఇది వ్యక్తిగత తప్పిదాల అంశం కాదు… న్యాయవ్యవస్థ పట్ల, రాజ్యాంగ నిబంధనల పట్ల ఒక స్వతంత్ర సంస్థ చూపిన అగౌరవానికి సంబంధించిన అత్యంత తీవ్రమైన అంశం. భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికలే ప్రాణవాయువు. ఆ ఎన్నికలను నిర్వహించే యంత్రాంగం నిష్పాక్షికంగా, పారదర్శకంగా, రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. కార్యనిర్వాహక వర్గం ఇచ్చే ఆదేశాలకు తలొగ్గి, ప్రజల ఓటు హక్కును సంక్షోభంలోకి నెట్టే చర్యలకు పాల్పడితే అది దేశ సార్వభౌమాధికారానికే ముప్పు. సుప్రీంకోర్టు తాజా మొట్టికాయలు ఎన్నికల సంఘానికి కనువిపð కావాలి. ప్రభుత్వం సైతం రాజ్యాంగ సంస్థలను పావులుగా వాడుకునే నియంతృత్వ వైఖరిని వీడాలి. పౌర సమాజం, రాజకీయ పక్షాలు, న్యాయవ్యవస్థ సమష్టిగా నిలబడితేనే స్వతంత్ర వ్యవస్థల పవిత్రత, భారత ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమవుతాయి. తాజాగా సమావేశమైన ‘ఇండియా’ కూటమి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడం, ఇంకోవైపు సీజేపీ కుర్రాళ్లు జంతర్‌మంతర్‌లో జడిపుట్టించడం వంటి ఉదంతాలు ప్రజాస్వామ్యానికి ఊపిరులూదుతాయని ఆశించవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు