తెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమైన క్రమంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఇంధనానికి జీవనాడి అయిన హర్ముజ్ జలసంధి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఆ మార్గం గుండా ఏ నౌకైనా వెళ్లడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్, నౌకాదళ సిబ్బంది ఆ పని చేస్తారని ఇరాన్ హెచ్చరించింది. దీంతో సుమారు 700 ఆయిల్ ట్యాంకర్లు జలసంధికి ఇరువైపులా నిలిచిపోయాయి. అయితే తాజా చర్యలతో ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్‌కు భారీ ఎదురుదెబ్బ. ఎందుకంటే ఈ జలసంధి ప్రపంచ మార్కెట్‌కు కీలకమైనది. ప్రపంచంలోని రోజువారీ చమురు వినియోగంలో దాదాపు 20 శాతం ఈ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. ఇరుకైన ప్రదేశంలో ఇది సుమారు 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ జలసంధి ద్వారా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యూఏఈ, గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంకు అనుసంధానమవుతున్నాయి.


