Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆక్సిజన్‌ కొరతపై కట్టుకథలు

ఏ దేశంలోనూ చావు మీద రాజకీయాలు ఉండవేమో! కానీ మనదేశంలో ఉంటాయి అని సాక్షాత్తు పార్లమెంటు వేదిక మీంచి ఆరోగ్య శాఖ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ ప్రకటించడమే రుజువు. కేంద్ర ప్రభుత్వం కరోనా మృతుల సంఖ్య గురించి మాత్రమే కాకుండా ఈ మరణాలకు కారణాల విషయంలోనూ పచ్చి అబద్ధాలు చెప్తోంది. రాష్ట్రాలు కూడా ఇదే పాట పాడుతున్నాయి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఇతరేతర కారణాలవల్ల నెపం కేంద్ర ప్రభుత్వం మీదకు తోస్తూ ఉండవచ్చు. ఇది కల్తీ లేని శవ రాజకీయమే. కరోనా మృతుల సంఖ్యలో అధికారిక లెక్కల ప్రకారమే మనదేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. అమెరికా లోని మేధో మధన సంస్థ ‘‘సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్మెంట్‌’’ అభిప్రాయ పడిరది. ఈ నివేదిక తయారీలో న్యాయమూర్తి శాండెఫర్‌, భారత మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యన్‌, హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ఆనంద్‌ మొదలైన వారి భాగస్వామ్యమూ ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం నాలుగు లక్షల మందికి పైగా కరోనా వల్ల మరణించినట్టు లెక్క. కానీ అమెరికా సంస్థ అంచనా ప్రకారం మృతుల సంఖ్య 34 నుంచి 49 లక్షల దాకా ఎంతైనా కావచ్చు. అసలు మృతుల సంఖ్య విషయంలోనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ వాస్తవాలు చెప్పనప్పుడు కరోనా పీడితుల్లో ఆక్సిజన కొరతవల్ల మరణించింది ఎంతమందో చెప్పడం కష్టమే. కానీ ఆక్సిజన్‌ కొరత వల్ల ఎవరూ మరణించలేదనేది రాజ్యసభలో కేంద్ర మంత్రి వాదన. మరి అలాగైతే పరిశ్రమలు వినియోగించే ఆక్సిజన్‌ను వైద్యం కోసం తరలించాలని ఎందుకు ఆదేశించినట్టు! ఇబ్బడి ముబ్బడిగా ఆక్సిజన్‌ తయారీ కేంద్రాలను నెలకొల్పుతున్నామని చెప్పడం ఎందుకు? కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన 113 పేజీల అఫిడవిట్‌లో సైతం ఆక్సిజన్‌ లేక మరణించిన వారి వివరాలు లేవు. సమస్యంతా ఎక్కడుందంటే ఆక్సిజన్‌ లేక ఫలానా రోగి మరణించినట్టు నమోదు చేసే విధానమే లేదు. ఆక్సిజన్‌ లేక మరణించడాన్ని అసహజ మరణంగానో లేదా పోలీసు కేసు కిందో పరిగణిస్తారట. కానీ కరోనా మహమ్మారి ఆవహించిన రెండవదశలో అనేక చోట్ల ఆక్సిజన్‌ కొరత ఏర్పడినట్టు హాహాకారాలు బయలు దేరాయి. ఏ రోగికైనా ఆక్సిజన్‌ అందకపోతే అది వివిధ ప్రధాన అంగాలు పని చేయకుండా చేయవచ్చు. ఉదాహరణకు మెదడు స్పందించక పోవచ్చు. గుండె ఆగిపోవచ్చు. కాలేయంలాంటివి స్తంభించవచ్చు. కానీ ఆక్సిజన్‌ లేక మరణించిన వారి సంఖ్య కనీసం 178 ఉంటుందని వివిధ సందర్భాలలో డాక్టర్లే అంగీకరించారు. కొరత తీవ్రంగా ఉన్నప్పుడు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆక్సిజన్‌ కోసం హాహాకారాలు చేశారు. ఫలానా రాష్ట్రానికి ఇంత ఆక్సిజన్‌ పంపిస్తున్నామని ప్రభుత్వమూ గొప్పగా ప్రకటించుకుంది. సింగపూర్‌ లాంటి దేశాల నుంచి ఆక్సిజన్‌ దిగుమతి చేసుకోవలసి వచ్చింది. కొన్ని దేశాలు ఆక్సిజన్‌ తయారీ పరికరాలను అందించాయి. లేదా మనం దిగుమతి చేసుకున్నాం. అనేక మంది రోగుల బంధువులు ఆక్సిజన్‌ లేకే తమ ఆత్మీయులు మరణించారని విలపించారు.
ఆర్థర్‌ హేలీ నవల ఫైనల్‌ డయాగ్నాసిస్‌లో రోగ కారణం లేదా మరణ కారణం ఏమిటో తేలకపోతే శవపరీక్షలో కచ్చితంగా తేలుతుంది అంటాడు. కానీ కరోనా మృతుల్లో ఆక్సిజన్‌ లేక మరణించిన వారెంతమందో నమోదు చేసే పద్ధతి లేనందువల్ల ఈ సాంకేతిక కారణం ఆసరాగా కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్‌ లేక ఎవరూ మరణించలేదు అని చెప్తోంది. ఇది పచ్చి అబద్ధం. పార్లమెంటులో అసత్యాలు మాట్లాడడం అంటే పార్లమెంటును పెడదోవ పట్టించడం. సభా హక్కులను ఉల్లంఘించడం. మృతుల బంధువుల మనోభావాలను అలవోకగా కొట్టిపారేయడం. ఆక్సిజన్‌ కొరత వల్ల ఇంతమంది మరణించారని ప్రత్యేకంగా నమోదు చేసే పద్ధతి లేదని చెప్పినా నిజం చెప్పినట్టు అయ్యేది. కానీ ఈ ప్రభుత్వానికి ఇలాంటి మర్యాదలు పాటించే అలవాటు లేదు. అసత్యమే మోదీ సర్కారుకు మూలాధారంగా కనిపిస్తోంది. అందుకే పార్లమెంటులో చెప్పే మాటలను కూడా జనం నమ్మడం లేదు. మరణాలకు సంబంధించినంత మేరకు మానవీయ విలువలు పాటించే వారెవరూ అవాస్తవాలు మాట్లాడరు. కానీ మోదీ సర్కారులో ఎవరైనా ఆ పని చేయగలరు. అబద్ధాల పునాదుల మీద అధికార పీఠాలు ఎక్కగలిగిన వారు ఇంతకన్నా ఏం చేస్తారు గనక! ఉత్తర్‌ప్రదేశ్‌లోని బి.ఆర్‌.డి. వైద్య కశాశాల ఆసుపత్రిలో ఆక్సిజన్‌ లేక 2017లో 100 మంది పసికందులు మరణించారు. అప్పుడు డా. కఫీల్‌ ఖాన్‌ తన సొంతడబ్బుతో ఆక్సిజన్‌ ఏర్పాటుచేయడం మహా పాపమై పోయింది. ఆయన మీద అనేక కేసులు నమోదు చేశారు. ఆ మరణాలకు ఆయననే బాధ్యుడిని చేశారు. ఆసుపత్రి అంతర్గత దర్యాప్తులో ఆయన నిర్దోషిగా తేలారు. అప్పుడు కరోనా ఊసే లేదు. కానీ ఆ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడిరది. దీనికి పసిపిల్లల ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించిన డాక్టర్‌ను వేధింపులకు గురి చేశారు. కానీ ఆక్సిజన్‌ కొరత నిజమేగా. మరి గత మార్చి తరవాత రోజుకు మూడు నాల్గు లక్షల మందికి కరోనా సోకినప్పుడు ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉందిగా. దిల్లీతో సహా ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, హర్యానా, పంజాబ్‌, కర్నాటక, గోవా, రాజస్థాన్‌ రాష్ట్రాలలో ఆక్సిజన్‌ లేక కరోనా రోగులు మరణించారని వార్తలొచ్చాయిగా. ఆ వార్తలన్నీ ఇప్పుడు తప్పేనా! మిగతా రాష్ట్రాల సంగతి వదిలేసినా దేశ రాజధాని దిల్లీలో ప్రసిద్ధ ఆసుపత్రులు శ్రీ గంగారాం ఆసుపత్రి, జైపూర్‌ గోల్డెన్‌ ఆసుపత్రి, బత్రా ఆసుపత్రిలో ఏప్రిల్‌ 23, మే ఒకటవ తేదీన కనీసం 62 మంది ఆక్సిజన్‌ అందక మరణించారు.
కరోనా ఒక్కుమ్మడిగా ముంచుకొచ్చిన విపత్తు కనక ఆ పరిస్థితిని ఎదుర్కోవడం కష్టమే. కానీ ఆక్సిజన్‌ అందక ఒక్కరి ప్రాణాలూ పోలేదని అనడం బాధాతప్త ప్రజల హృదయాలను మరింత అవహేళన చేయడమే. వైద్య సదుపాయాలే అంతంత మాత్రం అయినప్పుడు రోగుల ఒత్తిడి అనూహ్యంగా పెరిగితే ఆక్సిజన్‌ అందించగల శక్తి ఆసుపత్రులకు ఉంటుందని నమ్మే వెర్రిబావులవాళ్లు ఎవరూ లేరు. ఎక్కువ మందికి ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది. అప్పుడు ఆక్సిజన్‌ అందజేయవలసిన పరిస్థితి ఏర్పడిరది. ఊహించని రీతిలో రోగులు వచ్చి పడ్తుంటే అందరికీ ఆక్సిజన్‌ అందించడం సాధ్యం కాకపోవచ్చు. రెండో విడత కరోనా పంజా విప్పినప్పుడు వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సరఫరా పెద్ద సమస్యగా మారింది. ఈ హఠాత్పరిణామానికి ఏ ప్రభుత్వం దగ్గరా సమాధానం ఉండకపోవచ్చు. సాంకేతిక కారణాల చాటున దాక్కుని లోపాలను కప్పి పుచ్చుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img