Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

జల వివాదాలపై చర్చించాలి

రావుల వెంకయ్య

ఈ మధ్యకాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య జల వివాదాలు తలెత్తాయి. రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడి ఉద్రిక్తతలకు దారితీస్తున్నది. సాగర్‌, శ్రీశైలం, పులిచింతలవద్ద పోలీస్‌ పహారాలు మోహరించాయి. ఈ వాతావరణం ఎక్కడికి దారితీస్తుందో తెలియదు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదుల మీద అక్రమప్రాజెక్టులు అనుమతులులేకుండా నిర్మిస్తున్నది. జల విద్యుత్‌ పేరుతో శ్రీశైలంలో 854 అడుగుల నుండి 834 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడూ నీరు తోడుస్తున్నారు. పులిచింతల వద్ద విద్యుత్‌ పేరుతో నీరు సముద్రంలోకి వృధాగా పోయే పరిస్థితి తీసుకువచ్చారు. మరో పక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరు వద్ద ఏకంగా 80,000 క్యూసెక్కుల నీరు తోడి పోసేందుకు ప్రభుత్వం అనుమతులు లేకుండా నిర్ణయం చేసింది. అంతకుముందు వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కాలంలో 11,000 క్యూసెక్కుల నీరు 44,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచటం జరిగింది. అది ఒక మేరకు రాయలసీమ ప్రజలకు మేలు చేసేదే. దానికే తెలంగాణ వారు కాకిగోల చేసారు. ఇప్పుడు ఏకంగా 80,000 క్యూసెక్కులకు పెంచితే తెలంగాణ చూస్తూ ఊరు కుంటుందా? ఈ రకంగా పోటీపడి కె.సి.ఆర్‌., జగన్‌ మోహన్‌రెడ్డి శ్రీశైలంలో నీరు తోడేస్తే ఆ ప్రాజెక్టులో నీరు ఉంటుందా? అది నిండితేినే కదా సాగర్‌కు నీరు వచ్చేది. ఇప్పటికే సాగర్‌ ఆయకట్టులో ఉన్న కుడి, ఎడమ కాలువల చివరి భూములకు నీరు రావటం లేదు. ప్రకాశం జిల్లా ప్రజలకి ప్రతి సంవత్సరం నీళ్ళు అందక తరచూ ఆందోళన బాట పడుతున్నారు. ఇక ఇప్పుడు ఉభయుల నిర్వాకం వలన ప్రకాశంజిల్లా వారే కాకుండా గుంటూరు, పశ్చిమ కృష్ణా ప్రజలు నీటి కోసం అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
కృష్ణానదిపై కర్నాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ భాగస్వాములుగా ఉన్నాయి. ఇప్పుడు 4వ రాష్ట్రంగా తెలంగాణ తోడయింది. బచావత్‌ అవార్డు ప్రకారం కృష్ణానదిలో 75%నీటి ఆధారంగా 2060 టియంసిల నీరుంటుందని లెక్క కట్టి ఉమ్మడి ఏపికి 800 టి.ఎం.సి.లు, కర్నాటకు 700 టి.ఎం.సిలు, మహారాష్ట్రకు 560 టి.ఎం.సి.లు నీటి ఆవిరి క్రింద 11టి.ఎం.సి.లు ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించారు. అందువల్ల మనకు 811 టి.యం.సిలు వచ్చింది. వరదలు వచ్చినప్పుడు వృధాగా సముద్రంలో కలిసే నీటిని దిగువన ఉన్న ఎ.పి. వాడుకునే అవకాశం కల్పించారు. బచావత్‌ అవార్డు గడువు 2000 సంవత్సరం వరకు ఉం టుందని చెప్పారు. చెన్న్తె ప్రజల దాహార్తిని తీర్చటానికి యన్‌.టి. రామారావు కాలంలో 15 టి.యం.సి.లు కేటాయించారు. దీనిలో ఆంధ్రప్రదేశ్‌ 5, కర్నాటక 5, మహారాష్ట్ర 5 టి.యం.సి.లు ఇవ్వటానికి అంగీకరించాయి.
బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ వచ్చిన తరువాత నీటిని తిరిగి లెక్కించారు. 75% నీటి లభ్యత అధారంగా కాకుండా 65% నీటి అధారంగా వరద జలాలు కూడా కలిపి పరిగణలోకి తీసుకొని 450 టి.యం.సి.లు అదనంగా వస్తాయని వాటిని నికర జలాలుగా మూడు రాష్ట్రాలకు పంపిణీ చేశారు. అందులో మనకు 190 టి.యం.సి.లు కలిపి 811G190R1001గా నిర్ధారించారు. వరద జలాల ఆధారంగా గాలేరునగరి, తెలుగుగంగ, హంద్రీనీవా, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌.ఎల్‌.బి.సి ప్రాజెక్టుల నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి వై.యస్‌.రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపనలు చేసి నిర్మాణాలు కూడా మొదలుపెట్టారు. నేడు ఆ ప్రాజెక్టుల నిర్మాణం చివరిదశలో ఉన్నాయి. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించకుండా కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పుడు అది విచారణలో ఉంది. 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో నదీ జలాల మీద ఒక అవగాహనకు వచ్చి ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్‌కు 512 టిఎంసిలు, తెలంగాణకు 299 టిఎంసిలు పంపిణీ చేశారు. నాడు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకారం తెలిపారు. అలాగే వరద జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న 7 ప్రాజెక్టులకుగాను 6 ప్రాజెక్టులకు చట్టబద్దత కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు`నగరి, వెలుగొండ, తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టంపాడులను గుర్తించారు. వెనుకబడిన నల్లగొండ జిల్లాకి చెందిన యస్‌.ఎల్‌.బి.సి. లెక్కలోకి తీసుకోకపోవటం సరికాదు.
ఇప్పుడు తెలంగాణ నీటి పంపకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. కృష్ణా పరివాహాక ప్రాంతం 62% తెలంగాణలో ఉంది. ఆంధ్రలో 38% మాత్రమే ఉన్నది కనుక కృష్ణాజలాలు 50:50 పంచాలని వితండవాడం చేస్తున్నది. ఆ మాటకొస్తే కర్నాటకలో పరివాహక ప్రాంతం ఎక్కువ ఉండి వారికి 700 మనకు 811 ఎలావచ్చాయి? ఆ వాదన సరికాదు. నదీ జలాల న్యాయసూత్రం ప్రకారం ఎవ్వరూ అంగీకరించరు. అలాగే గోదావరి నది నీటి మీద కూడా తొండి వాదనలు ముందుకు తీసుకువస్తోంది. దాని ఫలితంగా తెలంగాణ ప్రాంతంలో అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం మొదలు పెట్టింది.
గోదావరిలోని 3000 టి.యం.సి.లకుగాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్‌లకి పంచగా మనకు 1480 టి.యం.సి.లు వచ్చాయి. అందులో ఇప్పటికే 700 టి.యం.సి.లకు కూడా ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు. 780 టి.యం.సి.లు వృధాగా ప్రతి సంవత్సరం సముద్రంలో కలిసి పోతున్నాయి. అవి కాకుండా వరద జలాలు ప్రతి సంవత్సరం సముద్రంలో కలుస్తున్నాయి. వాటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టుగా గోదావరి మీద పోలవరం బహుళార్థక ప్రాజెక్టు ఇప్పటికే 75% పూర్తయింది. దానివలన కృష్ణా, గోదావరి అనుసంధానం జరిగితే రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రాజెక్టులకు నికర జలాలు వచ్చినట్లయితే కరువు సీమ సస్యశ్యామలంగా మారుతుంది. దానిని యుద్ధప్రాతిపదికగా పూర్తి చేయ్యాలి. ఇందుకు కూడా కేంద్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు కలిగిస్తోంది. వ్యయ అంచనాలు తగ్గించి నిర్వాసితులకు, మంచినీళ్ళకు, విద్యుత్‌కు మేము డబ్బులు ఇవ్వబోమని మోకాలు అడ్డుపెడుతోంది. దాని మీద రాష్ట్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకొని అందరిని కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలి. గోదావరి ప్రాజెక్టు మీద తెలంగాణ ప్రభుత్వం వితండవాదం తెచ్చింది. 1490 టి.యం.సి.లలో తెలంగాణకు 1100 టి.యం.సి.లు రావాలని అభ్యంతరాలు పెడుతోంది.
ఈ మధ్యకాలంలో జులై 15న కృష్ణా, గోదావరి బోర్డులు వివాదాల పరిష్కారం కోసం నోటిఫికేషన్‌ జారీచేసి గజిట్‌ ప్రకటించింది. ఈ బోర్డులకు ఇతర రాష్ట్రాల వ్యక్తులు ఛైర్మన్‌లుగా నియమిస్తామన్నారు. వీటి నిర్వాహణ కోసం ఉభయ రాష్ట్రాలు చేరి 200 కోట్లు చెల్లించమంటున్నారు. చిన్నవి, పెద్దవి 131 ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి తీసుకు వచ్చారు. వివాదాలు లేని ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీని కూడా బోర్డుల పరిధిలోకి తీసుకువచ్చారు. విభజన చట్టాలు అమోదించిన ఆ ప్రాజెక్టులలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టును అనుమతులు లేని ప్రాజెక్టుగా చూపించారు. మొత్తం నిర్వాహణ కేంద్రం చేతిలోకి తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నది. ఇది రాష్ట్రాల అధికారాలకు పూర్తిగా కత్తెర వెయ్యటమే.
ఈ పూర్వరంగంలో ఈ బోర్డుల ఏర్పాటు చూడాల్సిన అవసరం ఉంది. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. నదీ జలాల సమస్య చాలా సున్నితమైనది. రెండు ప్రాంతాల ప్రజలు, వెనకబడిన జిల్లాలకు సంబంధించిన అంశం. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కాని తెలంగాణలోని మహబూబ్‌ నగర్‌, నల్లగొండ జిల్లాలు ఆ జాబితాలో చేరినవే. ఉభయ ముఖ్యమంత్రులు గతంలో మంచి సంబంధాలు ఉన్నట్లు, ఒకరికొకరు రాజకీయంగా సహకరించు కుందామనుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మన ముఖ్య మంత్రి వెళ్ళి కె.సి.ఆర్‌.ని పొగిడారు. కె.సి.ఆర్‌. అయితే బేసిన్లు, భేషజాలు లేవు రెండు రాష్ట్రాల్లో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇద్దరం కట్టుబడి పనిచేస్తామన్నారు. కానీ రెచ్చగొట్టుకొనే పరిస్థితి ఎదురైంది. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకోకుండా సామరస్యంగా, శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. కేంద్రం పెత్తనానికి ఇరువురు అవకాశం ఇవ్వడం సహేతుకం కాదు.
వ్యాస రచయిత అఖిల భారత కిసాన్‌సభ ఉపాధ్యక్షులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img