Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలి

ట్రైనీ ఐపీఎస్‌ అధికారులతో ప్రధాని నరేంద్రమోడీ
భారత్‌ ప్రస్తుతం చరిత్రలో చాలా ముఖ్యమైన దశలో ఉందని..ఇటువంటి సమయంలో పోలీసులు తమ వ్యవస్థ పేరు, ప్రతిష్ఠలు మెరుగుపడటానికి కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. హైదరాబాద్‌ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ట్రైనింగ్‌ పూర్తిచేసుకున్న ఐపీఎస్‌ అధికారులతో (ఐపీఎస్‌ ప్రొబేషనర్లు) వర్చువల్‌ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. ఐపీఎస్‌ అధికారులతో ప్రత్యేకంగా సంభాషించారు. భారత దేశంలో పోలీసు వ్యవస్థపై వ్యతిరేక అభిప్రాయం ఉందని, ఈ వ్యవస్థ ప్రతిష్ఠను మెరుగుపరిచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. గడచిన 75 ఏళ్ళలో పోలీస్‌ శిక్షణను మెరుగుపరచడానికి భారత దేశం కృషి చేసిందన్నారు. దీనికోసం భవిష్యత్తులో మరింత మెరుగైన నిబంధనావళిని విధించే విషయాన్ని పరిశీలించాలన్నారు.ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బాధ్యతాయుతమైన పోలీసింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం కోసం దశాబ్దాల తరబడి కొనసాగుతున్న తప్పుడు విధానాలను, సంప్రదాయ కట్టుబాట్లను ప్రతి రోజూ తమ విధి నిర్వహణలో ఎదిరించవలసి ఉంటుందని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను ఎంచుకోవడం గర్వనీయమని మోడీ పేర్కొన్నారు. పోలీసు శాఖలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని.. ఇది దేశానికి శుభ పరిణామమని మోడీ తెలిపారు. దీంతో పోలీసింగ్‌ వ్యవస్థ పటిష్టంగా మారుతుందన్నారు. ప్రభుత్వం నక్సలిజానికి స్వస్తి పలికిందని.. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కొనసాగుతుందని మోడీ అన్నారు. దీనిని యువ నాయకత్వం ముందుకు తీసుకెళుతుందని ఆశిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.ప్రస్తుత సమాజంలో సైబర్‌ నేరాలు పెద్ద సమస్యగా మారాయని మోడీ అన్నారు. సైబర్‌ నేరగాళ్లు మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారని.. అన్ని ప్రాంతాలకు డిజిటల్‌ అవగాహనను విస్తరించాలని మోడీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img