Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బొగ్గు కొరతకు, విద్యుత్‌ కోతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో అమరావతి : దేశంలోని బొగ్గు కొరత, విద్యుత్‌ కోతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే కారణమని, రాష్ట్రంలో ప్రజలు విద్యుత్‌ వినియోగం తగ్గించుకోవాలని వైసీపీ నేతలు చెప్పడం జగనన్న చీకటి పథకానికి శ్రీకారమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, కార్పొరేట్‌ శక్తుల అనుకూల విధానాల వల్ల నేడు విద్యుత్‌ కోతలు అమలుచేసే పరిస్థితి ఏర్పడిరదన్నారు. ప్రత్యేకించి గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక నుంచే విద్యుత్‌ చార్జీలను తగ్గిస్తామని చెప్పారన్నారు. తదుపరి నాలుగు దఫాలుగా విద్యుత్‌ చార్జీలను పెంచి దాదాపు రూ.9 వేల కోట్ల అదనపు భారం ప్రజలపై మోపారన్నారు. విద్యుత్‌ సర్దుబాటు చార్జీల పేరుతో మరో రూ.3,699 కోట్లు గుదిబండ వేశారని, కేంద్రం విధించే విషమ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా తలొగ్గుతోందని పేర్కొన్నారు. ఇప్పుడు బొగ్గు కొరతను సాకుగా చూపి వేసవి కాలం రాకముందే రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ప్రారంభించిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రైతులకిచ్చే విద్యుత్‌లోనూ కోతలు విధిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్‌ సంస్కరణల అమలులో భాగంగా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే ప్రక్రియ మొదలుపెట్టారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లతో కుమ్మక్కవ్వడం ఫలితంగా దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడిరదని, దాని పర్యవసానంగా రాష్ట్రంలోని రాయలసీమ, కృష్ణపట్నం, విజయవాడ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి సగానికి పడిపోయిందని తెలిపారు. ఏపీలో 185 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉందని, ఏపీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరమవుతుందన్నారు. బొగ్గు కొరత కారణంగా సెప్టెంబర్‌ నెలలో 24 వేల టన్నులే సరఫరా చేశారని, బొగ్గు కొరత ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కరెంటు కోతలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని డిమాండు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అంబానీ, ఆదానీలకు మేలు చేకూర్చే పనులు మినహా, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పనులు ఏమాత్రం చేపట్టడం లేదన్నారు. ‘మాట తప్పంమడమ తిప్పం’ అన్న జగన్‌, 28 నెలలుగా విద్యుత్‌ చార్జీలను ఇబ్బడిముబ్బడిగా పెంచి మరోసారి మాట తప్పారని విమర్శించారు. ఇది జగనన్న చీకటి పథకానికి శ్రీకారంగా పేర్కొనవచ్చన్నారు. ప్రజలు విద్యుత్‌ వినియోగం తగ్గించుకోవాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని స్పష్టం చేశారు. విద్యుత్‌ బిల్లు తగ్గాలంటే లైట్లు, ఏసీలు ఆపమని వైసీపీ నేతలు చెబుతున్నారనీ, ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్‌ గెలుపు ఆపేయడం తథ్యమని తెలిపారు. సీఎం జగన్‌ కేంద్రంపై ఒత్తిడి పెంచి ఏపీకి బొగ్గు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్కరణలు, డిస్కమ్‌ల ప్రైవేటీకరణలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img