Friday, April 19, 2024
Friday, April 19, 2024

రెప్పపాటులో కబళించిన మృత్యువు

డివైడర్‌ను ఢీకొని బైక్‌ను ఢీకొట్టిన కారు
ముగ్గురు యువకుల దుర్మరణం

విశాలాంధ్ర-ఆళ్లగడ్డ/శిరివెళ్ల : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని కాసింతల క్షేత్ర సమీపంలో 40వ జాతీయ రహదారిపై కారు.. బైకును ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు నుంచి కడప వైపు వెళ్తున్న కారు ఆళ్లగడ్డ సమీపంలోకి రాగానే టైరు పేలడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. అనంతరం పల్టీలు కొడుతూ మరోవైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న శిరివెళ్లకు చెందిన అఫ్జల్‌, కలాం, జావెద్‌ అక్కడికక్కడే మృతి చెందారు. అదే బైక్‌పై ఉన్న మరో వ్యక్తి సులేమాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ రాజేంద్ర ఘటనాస్థలికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
మండల కేంద్రంలోని ముస్లిం మైనారిటీ పేటకు చెందిన ముగ్గురు యువకులు రహదారి ప్రమాదంలో మృతి చెందడంతో శిరివెళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. మిలాద్‌ఉన్‌నబీరోజున గౌండ పని కూలీల వేతనాలకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న యువకులను రెప్పపాటులో మృత్యువు కబళించింది. ప్రమాదంలో కలాం(30), జబీర్‌(20), అబ్జల్‌ (19) మృతి చెందగా, సులేమాన్‌ తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్టు బంధువులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ దిల్షాద్‌ నాయక్‌ ముజఫర్‌ హుస్సేన్‌, శిరివెళ్ల మండల పరిషత్‌ అధ్యక్షులు మహమ్మద్‌ వసీం, ఉపసర్పంచ్‌ ఇంతియాజ్‌, వైసీపీ సీనియర్‌ నేత అబ్దుల్‌ సలాం మాజినజీర్‌, సర్పంచ్‌ సాలమ్మ, తదితర ప్రజా ప్రతినిధులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పోలీస్‌ అధికారుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులను జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌, ఎంపీపీ, సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులకు వైయస్సార్‌ బీమా పథకాన్ని నాయకుల సహకారంతో త్వరితగతిన అందించేందుకు కృషి చేస్తామని విలేకరులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img