Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

100 కోట్ల కరోనా టీకాలు

75శాతం మందికి మొదటి డోసు
రెండు డోసులు 31 శాతం మందికే
ఇది నవ చరిత్ర : మోదీ

న్యూదిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద వాక్సినేషన్‌ ప్రక్రియ మరో మైలురాయిని అధిగమించింది. గురువారం ఉదయం నాటికి దేశంలో కరోనా టీకాల పంపిణీ వంద కోట్ల డోసుల మార్కును చేరింది. ఇప్పటివరకు బిలియన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. దీంతో చైనా తర్వాత బిలియన్‌ డోసులు పంపిణీ చేసిన దేశంగా భారత్‌ నిలిచింది. ఈ ఏడాది చివరినాటికి దేశంలోని మొత్తం 94.4 కోట్ల మంది వయోజనులకు వాక్సిన్‌ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకున్నది. ఈ ఏడాది జనవరి 16న దేశంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. ఇప్పటివరకు 75 శాతం వయోజనులు మొదటి డోసును, 31 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. ఈ నెలలో రోజుకు సరాసరి 50 లక్షల మందికి వాక్సిన్‌ పంపిణీ చేశారు. కాగా, ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్‌ 17న రికార్డు స్థాయిలో 2.5 కోట్ల మందికి టీకా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. టీకా డోసుల పంపిణీ వంద కోట్లు చేరడంపై ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ రికార్డును సాధించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘సరికొత్త చరిత్రను లిఖించాం. 130 కోట్ల మంది భారతీయుల సమష్టి స్ఫూర్తి, భారత సైన్స్‌, ఎంటర్‌ప్రైజ్‌ విజయాన్ని నేడు మనం చూస్తున్నాం. టీకా పంపిణీలో 100కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేసిన మన డాక్టర్లు, నర్సులు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. టీకా పంపిణీలో 100 కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా మోదీ గురువారం ఉదయం దిల్లీలోని రామ్‌మనోహర్‌ లోహియా ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఉన్నారు. అటు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా లక్నోలోని వాక్సినేషన్‌ కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య కార్యకర్తలను అభినందించారు. పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు కూడా ట్విటర్‌ వేదికగా 100 కోట్ల మార్క్‌పై అభిందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడారు. ‘టీకా పంపిణీలో అద్భుతమైన లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా భారత ప్రజలకు అభినందనలు. ఈ చరిత్రాత్మక రికార్డును చేరుకోవడంలో కృషి చేసిన వైద్యారోగ్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, టీకా తయారీదారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అభినందనలు. ఇంకా వాక్సిన్‌ తీసుకోనివారు భయాలన్నీ పక్కనబెట్టి టీకా వేయించుకోవాలని కోరుకుంటున్నా. మనమంతా కలిసి కరోనాను ఓడిద్దాం’ అని పేర్కొన్నారు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ ‘100కోట్లు అంటే కేవలం ఒక సంఖ్య కాదు.. వంద కోట్లకు పైగా ప్రజల ఆత్మవిశ్వాసం. టీకా పంపిణీలో చిరస్మరణీయ ఘనత సాధించిన సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలు’ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img