Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

39 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌

న్యూదిల్లీ : భారత సైన్యంలో మరో 39 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా దక్కనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం వారికి శాశ్వత కమిషన్‌ హోదా కల్పించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడిరచింది. సైన్యంలో 14ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా ఇవ్వాలని సుప్రీంకోర్టు 2020 ఫిబ్రవరి 17న తీర్పువెలువరించింది. దీంతో సైన్యం ఓ కమిటీని ఏర్పాటు చేసి 400 మందికి పైగా మహిళా అధికారులకు ఈ హోదా కల్పించింది. మహిళా అధికారుల వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్‌) సమీక్షను ఆధారంగా చేసుకుని కొందరికి ఈ హోదా ఇచ్చింది. దీంతో శాశ్వత కమిషన్‌ తిరస్కరణకు గురైన 71 మంది అధికారిణులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శాశ్వత కమిషన్‌లో చేర్చే విధానం ఏకపక్షం, అన్యాయంగా ఉందని ఆరోపిస్తూ అనేక అంశాలను తమ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం..ఏసీఆర్‌ విధానాన్ని అనుసరించడం వివక్షపూరితమేనని అభిప్రాయపడిరది. దీనిపై కేంద్రం స్పందన అడిగిన న్యాయస్థానం.. అప్పటిదాకా ఈ 71 మంది మహిళా అధికారులను సర్వీసు నుంచి తొలగించొద్దని ఆదేశించింది. దీనిపై కేంద్రం తమ స్పందన తెలియజేసింది. ఈ 71 మందిలో 39 మంది మహిళా అధికారులు శాశ్వత కమిషన్‌కు అర్హులుగా గుర్తించినట్లు కేంద్రం వివరించింది. మరో ఏడుగురు వైద్యపరంగా ఫిట్‌గా లేరని, మిగతా 25 మందిపై తీవ్రమైన క్రమశిక్షణారాహిత్య అభియోగాలున్నాయని పేర్కొంది. కేంద్రం నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు.. ఆ 39 మందికి వారం పని దినాల్లో శాశ్వత కమిషన్‌ హోదా కల్పించాలని ఆదేశించింది. మిగతా 25 మంది శాశ్వత కమిషన్‌కు ఎందుకు అనర్హులో తెలియజేయాలని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img