Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

శకటాల ఎంపికలో మార్పులేదు

రక్షణశాఖ అధికారుల వెల్లడి
న్యూదిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో కేరళ, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడుల శకటాల (నమూనా)ను చేర్చకూడదన్న నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారులు మంగళవారం తెలిపారు. కవాతులో ప్రదర్శనకు మొత్తం 12 రాష్ట్రాల నమూనాలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. తమ రాష్ట్రాల శకటాలకు పరేడ్‌లో స్థానం కల్పించకపోవడంపై పశ్చిమబెంగాల్‌, తమిళనాడు ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ, స్టాలిన్‌ మాట్లాడుతూ… ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు చెందిన కొందరు నాయకులైతే ఈ విషయంపై విమర్శలు గుప్పించారు. ఆయా రాష్ట్రాలను కేంద్రం అవమానిస్తోందన్నారు. ఈ వివాదంపై రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి మాట్లాడుతూ… ఈ మూడు రాష్ట్రాల అభ్యర్థనలను ఆమోదించడం సాధ్యం కాదని చెప్పారు. శకటాల ఎంపికపై సుదీర్ఘ ప్రక్రియను వివరిస్తూ… ఈ విషయంలో ఆయా రాష్ట్రాల సీఎంలకు మర్యాదపూర్వకంగా సమాధానాలు పంపబడ్డాయని చెప్పారు. నిర్ణయాన్ని సవరించడం లేదా పునఃపరిశీలించడం సాధ్యం కాదని, నిపుణుల కమిటీ ఈ నిర్ణయాలను ముందుగానే తీసుకుంటుందని ఆ అధికారి తెలిపారు. ఈ ఏడాది గణతంత్ర పరేడ్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌, జమ్మూకశ్మీర్‌, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల నుంచి నమూనాలను ప్రదర్శించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ ఏడాది కవాతులో కేంద్ర ప్రభుత్వంలోని తొమ్మిది మంత్రిత్వ శాఖలు , విభాగాలకు సంబంధించిన నమూనాలను ప్రదర్శిస్తారని వారు వివరించారు.
పరిమిత సంఖ్యలో సందర్శకులకు అనుమతి
కోవిడ్‌-19 వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ కవాతును వీక్షించేందుకు అనుమతించబడే వారి సంఖ్య 70-80 శాతం తగ్గుతుందని రక్షణశాఖ అధికారులు వెల్లడిరచారు. మొత్తంగా సందర్శకుల సంఖ్య సుమారు 5,000-8,000 వరకు ఉంటుందని పేర్కొన్నారు. గత సంవత్సరం జరిగిన కవాతుకు దాదాపు 25,000 మంది సందర్శకులను అనుమతించారు. అంతేకాక ఈ ఏడాది జరిగే కవాతుకు ముఖ్య అతిథులు వస్తారా లేదా అనే విషయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా అధికారులు వెల్లడిరచారు. గతేడాది జరిగిన కవాతుకు ముఖ్య అతిథి ఎవరూ లేరు. కవాతు కరోనా వ్యాప్తికి సూపర్‌ స్ప్రెడర్‌ ఈవెంట్‌గా మారకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకే సందర్శకుల సంఖ్యను గణనీయంగా తగ్గించినట్లు అధికారులు వివరించారు.
ముఖ్య అతిథులకు సంబంధించిన నిర్ణయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందని, ఈ విషయంలో వారి నిర్ణయం కోసం వేచి చూస్తామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img