Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఆజం ఖాన్‌ బెయిల్‌పై సమాధానం చెప్పండి

యూపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం
న్యూదిల్లీ : భూకబ్జా కేసులో తన బెయిల్‌ పిటిషన్‌ విచారణలో జాప్యంపై సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించింది. న్యాయమూర్తులు ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, మంగళవారం విచారణ చేస్తామని తెలిపింది. ‘ఏమిటి, ఇతన్ని ఎందుకు వదలడం లేదు. రెండేళ్ల నుంచి జైల్లో ఉన్నాడు.. ఒకట్రెండు కేసులు ఓకే… కానీ 89 కేసుల్లో మాత్రం కుదరదు.. బెయిల్‌ వచ్చినప్పుడల్లా మళ్లీ ఏదో ఒక విషయంలో జైలుకు పంపుతున్నారు. ప్రత్యుత్తరం దాఖలు చేయండి. మేము మంగళవారం విచారణ చేస్తాం’ అని పేర్కొంది. ‘అతను ఒక విషయంలో బెయిల్‌పై విడుదలయినప్పుడు అతనిపై మరొక కేసు నమోదు చేసి కటకటాల్లోనే ఉంచేలా ఈ గొలుసు కొనసాగుతుంది’ అని జస్టిస్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు. ఖాన్‌ తరపున వాదించిన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ, ఇది ఆందోళనకరమైన కేసు అని, దీనికి వివరణాత్మక విచారణ అవసరమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ, ఖాన్‌పై నమోదయిన ప్రతి కేసులోనూ తప్పుడు అభిప్రాయాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌ను విచారణలో జాప్యం చేయడంపై సుప్రీం కోర్టు గతంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘అతను (ఖాన్‌) చాలా కాలంగా ఒక విషయంలో తప్ప అన్ని విషయాల్లో బెయిల్‌పై బయట ఉన్నాడు. ఇది న్యాయాన్ని అపహాస్యం చేస్తుంది. మేము ఇంతకు మించి ఏమీ చెప్పము’ అని ధర్మాసనం పేర్కొంది. బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు తన తీర్పును రిజర్వ్‌ చేసిందని ఖాన్‌ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. తన మొహమ్మద్‌ అలీ జౌహర్‌ యూనివర్సిటీ ప్రాజెక్ట్‌ కోసం శత్రువుల ఆస్తులను లాక్కున్న కేసులో ఖాన్‌ బెయిల్‌ దరఖాస్తుపై అలహాబాద్‌ హైకోర్టు మే 5న తన నిర్ణయాన్ని రిజర్వ్‌ చేసింది. శత్రువుల ఆస్తులను లాక్కోవడం, వందల కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఆజం ఖాన్‌, ఇతరులపై కేసు నమోదయింది. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను జైలులో ఉంచేందుకు ఉద్దేశపూర్వకంగా విచారణను ఆలస్యం చేసేందుకు రాష్ట్రం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అవలంబించిందని ఖాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ పేర్కొంది. ఖాన్‌ ప్రస్తుతం రామ్‌పూర్‌లో భూకబ్జా కేసుతో సహా అనేక కేసులకు సంబంధించి సీతాపూర్‌ జైలులో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img