నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ వ్యవహారంలో కొనసాగువుతున్న ఏసిబి సోదాలు
క్యాంటీన్‌తో పాటు మెడికల్ స్టోర్స్ నుంచి పెద్ద ఎత్తున లంచాలు
విశాలాంధ్ర, హైదరాబాద్: నగరంలోని ప్రముఖ నిజాం ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రిలో అక్రమాలు, అవినీతి అరాచకాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి విరుచుకుపడింది. నిమ్స్ లో సుమారు 40 మంది పైగా వివిధ విభాగల అధికారులు 2014 నుండి నిమ్స్ లో జరిగిన అవినీతి పై రికార్డ్స్ పరిశీలన కొనసాగుతున్నట్లు తెలిసింది. నిమ్స్ ఆసుపత్రిలోని సర్జికల్ స్టోర్స్ హెడ్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ చుట్టూ ముసురుకున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు గురువారం తీవ్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి పరిధిలోని క్యాంటీన్లు, మెడికల్ స్టోర్స్, సర్జికల్ విభాగాలు కేంద్రంగా భారీ ఎత్తున నిధుల మళ్లింపు, అక్రమాలు చోటుచేసుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. క్యాంటీన్ నిర్వాహకులు, మెడికల్ స్టోర్ల యజమానుల నుంచి కీలక స్థానాల్లో ఉన్న అధికారులకు దాదాపు ₹50 లక్షల వరకు లంచాల రూపంలో దండుకుంటున్నట్లు సమాచారం లభించడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఈ భారీ అవినీతి మూలాలను వెలికితీసేందుకు ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సంయుక్తంగా దాడులు చేపట్టాయి. నిమ్స్ పరిపాలనా (అడ్మినిస్ట్రేటివ్) విభాగంలో కీలక రికార్డులు, ఆర్థిక లావాదేవీల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి స్వాధీనం చేసుకుందని తెలిసింది. నలుగురు అధికారులతో కూడిన బృందం నిమ్స్ క్యాంటీన్లో ఆహార నాణ్యత, కాంట్రాక్టు నిబంధనలు, అక్రమ వసూళ్లపై తనిఖీలు నిర్వహించినట్టు ప్రచారం సాగుతోంది. నలుగురు డ్రగ్ ఇన్స్పెక్టర్లు సర్జికల్ స్టోర్స్‌లోని మందులు, వైద్య పరికరాల నిల్వలు (స్టాక్ రికార్డులు), కొనుగోలు రికార్డులను సమగ్రంగా తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. ఆసుపత్రిలోని కీలక అధికారులకు మెడికల్, సర్జికల్, క్యాంటీన్ల నుంచి ఏ విధంగా ముడుపులు అందుతున్నాయనే విషయమై అధికారులు కీలక సాక్ష్యాలు, రికార్డులు సేకరించారని, డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌తో పాటు మరికొందరు ఉన్నతాధికారుల పాత్రపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఈ తనిఖీల అనంతరం మరింత మంది అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిమ్స్ అధికారులు చర్చించుకుంటున్నట్లు సమాచారం.


