Homeఆంధ్రప్రదేశ్ఓట్ల కోసం ప్రేమలు.. గెలిచాక పొమ్మంటారు, పట్టించుకోరు.. ఓటర్ల మనోగతం

ఓట్ల కోసం ప్రేమలు.. గెలిచాక పొమ్మంటారు, పట్టించుకోరు.. ఓటర్ల మనోగతం

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; ఎన్నికలొచ్చాయంటే చాలు.. ఊరికి కొత్త కళ వచ్చేస్తుంది. ఇన్నాళ్లూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్న నాయకులంతా ఒక్కసారిగా ప్రజాసేవకు పూనుకుంటారు. ప్రజల మీద ప్రేమ పొంగిపొర్లుతుంది. కులాల మీద అభిమానం కట్టలు తెంచుకుంటుంది. మతాల మీద మమకారం మిన్నంటుతుంది. మొహం మీద చిరునవ్వులు పూస్తాయి. పలకరింపుల్లో తేనెలు కురుస్తాయి. అబ్బబ్బబ్బా.. ఇదేం ప్రేమరా బాబూ!

ఒకాయన నమస్తే అంటాడు.. ఇంకొకాయన అన్నా బాగున్నావా అంటాడు!

నిన్నటిదాకా పక్క వీధిలో ఉన్నా పలకరించని నాయకుడు.. ఇవాళ ఇంటి గుమ్మం దాకా వచ్చి మరీ ఆప్యాయంగా పలకరిస్తాడు. ఇంట్లో పెద్దవాళ్ల ఆరోగ్యం అడుగుతాడు. పిల్లల చదువుల గురించి ఆరా తీస్తాడు. మన కష్టాలు వింటాడు. సమస్యలు పరిష్కరిస్తానంటాడు. అవసరమైతే భుజం మీద చెయ్యి వేసి, ‘మీరు మా వాళ్లు.. మీకు నేనున్నా!’ అంటూ భరోసా ఇస్తాడు.

ఆ మాటలు వింటుంటే.. మన కోసం ఇన్నాళ్లూ ఇంతగా తపించిపోయిన మనిషి మనకు తెలియకుండానే దూరంగా ఉండిపోయాడా అనిపిస్తుంది!

టీ తాగమనే వినాయకులు.. బిర్యానీ పెట్టే భీములు!

ఎన్నికల సీజన్‌లో ఆతిథ్యానికి హద్దులుండవు. ‘అన్నా.. ఓ టీ తాగి వెళ్లు’ అని ఒకాయన ఆపుతాడు. ‘భోజనం చేసి వెళ్లండి’ అని మరొకాయన ప్రేమగా పిలుస్తాడు. ఇంకొకరు బిర్యానీ ప్యాకెట్లు సిద్ధం చేస్తారు. మరికొందరి దగ్గర మందు విందుల మాటలూ వినిపిస్తాయి.

నిన్నటిదాకా రూపాయి ఖర్చు పెట్టడానికి పదిసార్లు ఆలోచించినవాళ్లు.. ఇప్పుడు వందలు, వేలు ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. ఎందుకంటే ఇది ఖర్చు కాదు.. పెట్టుబడి! ఓటు రూపంలో రాబడి వస్తుందన్న ఆశ!

అయితే ఈ విందుల వెనుక ఉన్న అసలు విందు ఎవరిదో.. బిల్లు చివరికి ఎవరు కడతారో ఓటరు మహాశయుడికి తెలియనిదేమీ కాదు!

కులం పేరు మీద కౌగిలింతలు.. మతం పేరు మీద మమకారాలు!

ఎన్నికలొస్తే చాలు.. కుల సంఘాల నాయకులకు తమ కులం మీద ప్రేమ అమాంతం పెరిగిపోతుంది. ఏళ్ల తరబడి గుర్తుకురాని కుల బంధువులు ఒక్కసారిగా ఆత్మీయులైపోతారు. సమావేశాలు, సన్మానాలు, విందులు.. ఒకటేమిటి, కుల ఐక్యతకు కొత్త నిర్వచనాలు పుట్టుకొస్తాయి.

మత పెద్దల దగ్గర కూడా పలకరింపులు పెరుగుతాయి. ప్రార్థనా మందిరాల చుట్టూ రాజకీయ నాయకుల సందడి మొదలవుతుంది. మత సామరస్యం, సోదరభావం, సేవాభావం.. వినడానికి ఎంత మధురమైన మాటలో!

కానీ ఎన్నికలయ్యాక కూడా ఆ ప్రేమ ఇలాగే కొనసాగుతుందా? కుల సంఘంలో పేదవాడికి కష్టం వచ్చినప్పుడు ఇదే ఆప్యాయత కనిపిస్తుందా? మత పెద్దల దగ్గరికి రాజకీయ నాయకులు ఓట్లు అడగకుండా కూడా వస్తారా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎన్నికల ప్రచారంలో దొరకవు. ఫలితాల తర్వాతే తెలుస్తాయి!

ఓటు పడే వరకు బంధువులు.. ఆ తర్వాత అపరిచితులు!

ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుతుంది. నాయకుడు ప్రతి ఇంటికీ వస్తాడు. చేతులు జోడిస్తాడు. పెద్దల కాళ్లు మొక్కుతాడు. యువకులను అన్నా అంటాడు. మహిళలను అక్కా, చెల్లెమ్మా అంటాడు. చిన్నపిల్లలను ఎత్తుకుంటాడు. సెల్ఫీలు దిగుతాడు.

‘మీ సమస్యలన్నీ నాకు తెలుసు.. గెలిచిన వెంటనే పరిష్కరిస్తా’ అంటాడు.

ఓటరు కూడా సరేనంటాడు. నాయకుడు వెళ్లిపోయాక ఇంట్లో వాళ్లతో చర్చిస్తాడు. ఎవరు మంచివారు? ఎవరు అందుబాటులో ఉంటారు? ఎవరు నిజంగా పని చేస్తారు? అని ఆలోచిస్తాడు.

చివరికి తన మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకుంటాడు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అంటే అదే కదా!

కానీ ఫలితాలు వచ్చాక కథ మారుతుంది. గెలిచిన నాయకుడి చుట్టూ జనసందోహం ఉంటుంది. ఓడిన నాయకుడి ఫోన్ స్విచ్ఛాఫ్ కావచ్చు. గెలిచినవాడి దగ్గరికి వెళ్లాలంటే అనుమతి కావచ్చు. నిన్నటి ఆత్మీయ పలకరింపులు.. ఇవాళ కార్యాలయ గుమ్మం దగ్గర నిరీక్షణలుగా మారవచ్చు.

టీ తాగమన్నవాడు కనిపించడు. బిర్యానీ పెట్టినవాడు బిజీ అయిపోతాడు. ‘మీరు మా కుటుంబ సభ్యులు’ అన్నవాడు కుటుంబ కార్యక్రమాల్లో కూడా కనిపించకపోవచ్చు!

అప్పుడు ఓటరుకు అర్థమవుతుంది.. ఎన్నికల ముందు పంచిన ప్రేమలో ఎంత ప్రజాసేవ ఉందో.. ఎంత పదవీ వ్యామోహం ఉందో!

అయితే అందరూ అలాంటివాళ్లేనా?

కాదు.. ప్రజల మధ్యే ఉంటూ, ఎన్నికలతో సంబంధం లేకుండా సేవ చేసే నాయకులూ ఉన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేవారూ ఉన్నారు. ప్రజల కష్టాల్లో తోడుగా నిలిచేవారూ ఉన్నారు. అలాంటి వాళ్లను గుర్తించడం కూడా ఓటరు బాధ్యతే.

ఎందుకంటే ఓటు అనేది ఒక రోజు జరిగే కార్యక్రమం మాత్రమే కాదు.. ఐదేళ్ల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయం.

టీ ఇచ్చాడని ఓటేయొద్దు. బిర్యానీ పెట్టాడని ఓటేయొద్దు. కులం పేరుతో పిలిచాడని, మతం పేరుతో దగ్గరయ్యాడని ఓటేయొద్దు. మన ఊరికి ఏం చేశాడు? ఏం చేయగలడు? ప్రజలకు అందుబాటులో ఉంటాడా? అన్నది ఆలోచించాలి.

ఇక ఫైనల్ గా..

ఎన్నికల ముందు నాయకులు ప్రజల గుమ్మం తొక్కుతారు. ఎన్నికల తర్వాత ప్రజలు నాయకుల గుమ్మం తొక్కాల్సిన పరిస్థితి రాకూడదు.

ప్రజల ఓటు కోసం చూపించే ప్రేమ.. ప్రజల సమస్యల పరిష్కారంలోనూ కనిపించాలి. పలకరింపు ఓట్ల వరకే పరిమితం కాకూడదు. కులం, మతం పేరుతో కలిపే చేతులు.. ప్రజల అభివృద్ధి కోసం కూడా కలవాలి.

లేకపోతే ఎన్నికల ముందు ప్రేమలు.. ఎన్నికల తర్వాత దూరాలు!

అప్పుడు ప్రజల నోట ఒకటే మాట..

అయ్యా నాయకులారా.. మీ ప్రేమకు నమస్కారం! కానీ ఓట్ల పండగ అయిపోయింది కదా.. కనీసం ఇప్పుడు మా మొహం కూడా గుర్తుపట్టండి!’అని ఓటర్లు గగ్గోలు పెడతారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు