జాతీయ రహదారి విస్తరణ పనుల గుత్తేదారులకు, రైతులకు సూచించిన సర్పంచ్ పుష్పలత.
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వరి పొలాలు, మెట్ట పంటలు వేసే గరువులలో వర్షపు నీరు నిలువ ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని సర్పంచ్ దురియా పుష్పలత అన్నారు. పంచాయితీ పరిధిలోని చిన్నగెడ్డ గ్రామం సమీపంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నూతనంగా వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి, ఈ క్రమంలో నూతనంగా నిర్మిస్తున్న వంతెన సమీపంలో పెద్ద ఎత్తున మట్టి నిల్వ ఉండిపోవడంతో ప్రస్తుతం అల్ప పీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఎగువన ఉన్న మర్రి రాము అనే రైతుకు సంబంధించిన వరి పొలాలలో నీరు నిలువ ఉండి పంట మొత్తం పాడైపోయే ప్రమాదం ఉన్నందున, సచివాలయం 3 అగ్రికల్చర్ అసిస్టెంట్ చంద్రకళ విషయాన్ని సర్పంచ్ దూరియా పుష్పలత దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన ఆమె వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి సంబంధిత గుత్తేదారులతో చరవాణిలో చర్చించి అడ్డుగా ఉన్న మట్టిని తొలగిస్తే వర్షపు నీరు కాలువ ద్వారా దిగువ ప్రాంతానికి వెళ్ళిపోతుందని, తద్వారా ఎగువన ఉన్న పంట పొలాలు ముంపుకు గురికాకుండా ఉంటుందని సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాల వద్ద, చెట్ల కింద ఉండరాదని, కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, వర్షాల వలన ప్రభలే వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు.