వాయుగుండంతో పొంచి ఉన్న గండం
ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్న ఎంపీపీ అనూష దేవి.
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎంపీపీ కోరాబు అనూష దేవి అన్నారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారానికి తీవ్ర వాయుగుండం గా మారనుందని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కొండలను ఆనుకుని ఉన్న గ్రామాలలో వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడే అవకాశాలు ఉన్నందున ప్రమాదాలు సంభవించక ముందే సురక్షిత ప్రాంతాలలో ఉండాలని ఆమె సూచించారు. వాగులు, వంకలు పొంగి పోర్లే అవకాశం ఉన్నందున అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజలను అప్రమత్తం చేయవలసిన అవసరం ఉందన్నారు. వర్షాల కారణంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలన్నారు. వాతావరణంతో పాటు, ఊట జలాలు కలుషితం కావడం వలన వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని, వర్షాలు వలన గృహాలు, పంట నష్టం, ఇతర ఏ నష్టం జరిగినా తన దృష్టికి తీసుకురావాలని మండలంలోని ప్రజాప్రతినిధులతో పాటు, ప్రజలకు ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు.