విద్యార్థులలో నిగూఢంగా ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడమే క్రీడలు, సాంస్కృతిక, వకృత్వ పోటీల లక్ష్యం.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యురాలు డాక్టర్ విజయభారతి.
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- సంకల్పం మంచిదైతే ప్రకృతి కూడా తలొగ్గుతుందని తాను నమ్ముతానని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యురాలు డాక్టర్ ఎం విజయ భారతి అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఉద్యోగ సంఘాలు, కూటమి నాయకులు, పాత్రికేయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత నెల 29 న తమ కళాశాలలో జాతీయ స్పోర్ట్స్ డే నిర్వహించడం జరిగిందన్నారు. గడచిన పది రోజులుగా అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ 29వ తేదీన ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ డే కు ఎటువంటి ఆటంకం కలిగించకుండా వరుణుడు కూడా సహకరించాడని చిరుజల్లులతో వాతావరణాన్ని చల్లబరిచి కార్యక్రమాన్ని ఉత్సాహభరితమైన వాతావరణంలో నిర్వహించుకునేందుకు అవకాశం కలిగిందన్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న కళాశాలకు నూతన రూపు తీసుకురావాలనే సత్సకల్పంతో ముందుగా అధ్యాపకులు, విద్యార్థులతో కలసి కళాశాల రక్షణకు కంచె ఏర్పాటు చేసేందుకు తాత్కాలిక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అదే క్రమంలో కళాశాల ఆవరణలో మా కి నామ్ పే ఏక్ పేడ్ (అమ్మ పేరుతో ఒక మొక్క) అనే పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ఉపాధి హామీ పథకం ఏపీఓ లక్ష్మీనారాయణ మూర్తి మొక్కలు సమకూర్చి సహకరించారన్నారు. కళాశాల విద్యార్థులంతా సమైక్యంగా కళాశాల గదులను రూపుదిద్దుకున్నారన్నారు. అధ్యాపకులంతా సమిష్టి కృషితో తన ఆలోచనలను పాటించి కళాశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్నారు అన్నారు. కళాశాల స్వీపర్ నుంచి ప్రతి ఒక్కరూ కళాశాల అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. ఈ క్రమంలోనే అన్ని వర్గాల ప్రజల సహకారంతో స్పోర్ట్స్ డే ను ఈ కళాశాలలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. కళాశాల విద్యార్థిని, విద్యార్థులలో విద్యతో పాటు వారిలో నిగూడంగా దాగివున్న స్కిల్స్ ను వెలికి తీసేందుకే క్రీడలు, సాంస్కృతిక, వకృత్వ తదితర పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కొంతమంది ఇటువంటి కార్యక్రమాలను స్వాగతించే స్థితిలో ఉండరని, దాని వలననే ఆటలే తప్ప పాటలు బోధించడం లేదనే తప్పుడు ప్రచారం జరగడం సహజమన్నారు. పాఠశాలలు, కళాశాలలో తరతరాలుగా క్రీడలు, సాంస్కృతిక, వకృత్వ తదితర పోటీలు నిర్వహిస్తూనే విద్యను బోధించడం అందరికీ తెలిసిన విషయమే అన్నారు. గతానికి భిన్నంగా విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ ప్రాంతంలో విద్యార్థులు నైపుణ్యం కలిగిన వారన్నారు. సాన బడితే ప్రతి రంగంలోనూ ఈ ప్రాంత విద్యార్థులు రాణించగలరన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈ కళాశాలలో విద్యనభ్యసించిన ఈ ప్రాంతానికి చెందిన లంబసింగి యువకుడు సబ్ ఇన్స్పెక్టర్ గా ఎంపిక కావడం తమకెంతో గర్వకారణం అన్నారు. మంచి ఆలోచనలతో అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది అనే తారతమ్యం లేకుండా అందరితో కలిసి పనిచేయడమే తనకు ఇష్టం అన్నారు. ఈ కళాశాల నుంచి విద్యార్థులు అందరినీ ఉన్నత చదువులతో మంచి స్థాయికి తీసుకురావాలన్నదే తన కోరిక అన్నారు. ఈ క్రమంలో మన్యప్రాంత విద్యార్థులను మైదాన ప్రాంతంలోని అనేక ప్రాంతాల విశిష్టతను తెలుసుకునేందుకు హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తీసుకువెళ్లి వారిలో చైతన్యం కలిగించేందుకు కృషి చేయాలని సంకల్పిస్తున్నానన్నారు. అందరి సహకారం ఉంటే అది కూడా సాధ్యమవుతుందన్నారు. సంకల్పం మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుందని స్పోర్ట్స్ డే రోజే రుజువైందన్నారు. లక్ష్యం నిర్ణయించుకుని ముందుకు సాగితే ఎంతటి కష్టతరమైన పనైనా సుసాధ్యం అవుతుందని తాను నమ్ముతానన్నారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, పాత్రికేయ సోదరులు ప్రసంగించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం ఉద్యోగ సంఘ ప్రతినిధులు కళాశాల ప్రధానాచార్యురాలు డాక్టర్ ఎం విజయ భారతిని దుశ్శాలులతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.