గ్రహణం వీడేదెప్పుడు… రహదారి పూర్తయ్యేదెప్పుడు
పదేళ్లలో నాలుగు సార్లు శంకుస్థాపనలు
శంకుస్థాపనలకే పరిమితమవుతున్న అంజలి శనివారం రహదారి
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అంజలి శనివారం రహదారికి రాజకీయ గ్రహణం ఏమైనా పట్టుకుందా? ఆ గ్రహణం వీడేందుకు శాంతులేమైనా చేయించాలా? అనే పలు సందేహాలు ఆ ప్రాంత ప్రజలలో వ్యక్తమవుతున్నాయి. ఈ పంచాయితీ ఏ ముహూర్తాన ఏర్పడిందో, ఆ పంచాయతీ కి రహదారి శంకుస్థాపన ఏ ముహూర్తాలలో చేస్తున్నారో కానీ! అప్పుడు పట్టిన గ్రహణం స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు పూర్తి కావస్తున్నా నేటికీ వీడలేదు. గడచిన పదేళ్ల కాలంలో ఈ రహదారి నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు నాలుగు సార్లు శంకుస్థాపనలు చేశారంటే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. జాజులపాలెం నుండి అంజలి శనివారం వరకు సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించ తలపెట్టిన ఈ రహదారి నిర్మాణ పనులను పదేళ్ల క్రితం అప్పటి అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత లాంఛనంగా ప్రారంభించారు. “దేవుడు కరుణించినా పూజారి కరుణించలేదు” అన్న చందంగా అప్పుడు ఆ పనులు దక్కించుకున్న గుత్తేదారుడు ఆ పనులను ఆదిలోనే నిలిపి వేశాడు. ఆ తరువాత అదే రహదారికి 2018 లో అప్పటి శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి లాంఛనంగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అయినప్పటికీ రహదారి నిర్మాణ పనులు పూర్తి కాలేదు. ఆనాడు వారిద్దరూ ప్రతిపక్ష వైకాపాలో ఉన్నారు. తరువాత 2019లో వైకాపా ప్రభుత్వంలో పాడేరు శాసన సభ్యురాలిగా కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆ రహదారి నిర్మాణ పనులకు మరలా శంకుస్థాపన చేశారు. ఆ తరువాత జెట్పిటీసీ పోతురాజు బాలయ్య, ఎంపిపి కోరాబు అనూష దేవి, స్థానిక సర్పంచ్ పేట్ల రాజుబాబుతో కలిసి మరో మారు శంకుస్థాపన చేశారు. మండలం మొత్తంలో ఇలా నాలుగు సార్లు శంకుస్థాపనలు జరిగి పూర్తికాని రహదారి ఏదైనా ఉందంటే అది అంజలి శనివారం రహదారి అని చెప్పక తప్పదు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్రాలలో ఓటమి ప్రభుత్వాలు కొలువుదీరిన నేపథ్యంలో ఇప్పటికైనా పూర్తి చేస్తారా? లేక నూతనంగా శంకుస్థాపనలు చేసి మరలా మమ అనిపిస్తారా అని ఈ ప్రాంతీయులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.