ఆసుపత్రి సూపరిండెంట్ ప్రభావతి
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఆసుపత్రి అభివృద్ధికి అందరి సహకారం అవసరమని స్థానిక ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ ప్రభావతి అన్నారు. పంద్రాగస్టును పురస్కరించుకుని స్థానిక ఆసుపత్రి వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముందుగా పాత్రికేయులతో సమావేశమైన ఆమె చింతపల్లి, మీది మండలాలకు పెద్ద దిక్కైన ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి పరచడంతో పాటు, వ్యాధిగ్రస్తులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రజల, పాత్రికేయుల సహకారం అవసరం అన్నారు. అందరి సహకారంతో ముందుకు వెళితేనే సత్ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. కనుక ఆసుపత్రి అభివృద్ధికి, ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యానికి సహకరించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేశెట్టి సత్యనారాయణ (సతీష్) స్థానిక పాత్రికేయ బృందం కలిసి ఆమెకు ఉత్తరాంధ్ర జర్నలిస్టు ఫ్రంట్ డైరీ ని అందించారు. ఆ డైరీలో పాత్రికేయులకు సంబంధించిన మొబైల్ నెంబర్లతో పాటు ఉత్తరాంధ్ర సమగ్ర రూపం ఉంటుందని, తమను సంప్రదించేందుకు మొబైల్ నెంబర్లు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా ఆమెకు పాత్రికేయులు వివరించారు.