తెదేపా నాయకులు నాగభూషణం, పూర్ణచంద్రరావు, లక్ష్మణ్, ఆనందరావు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- సీనియర్ నాయకులు అని చెప్పుకునే తెదేపా నేతలు ఆ తరం నాయకులను, వారి కుటుంబాలను పార్టీ పరంగా ఆదుకోవడంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ అరకు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణం, మండల అధ్యక్ష ఉపాధ్యక్షులు కిల్లో పూర్ణచంద్రరావు, లక్ష్మణ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనందరావు లు అన్నారు సోమవారం వారు మాట్లాడుతూ రాష్ట్రమంతటా ఎన్డీఏ కూటమి లో తెలుగుదేశం తిరుగులేని విజయం నమోదు చేసుకుంటే మన్య ప్రాంతంలో నేతల మధ్య సమన్వయం లోపించి విజయం సాధించే సీటును వైకాపాకు అప్పగించడం జరిగిందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చెత్తశుద్ధిగా పనిచేసినప్పటికీ నేతల మధ్య సమన్వయ లోపం మన్య ప్రాంతంలో పాడేరు, అరకు స్థానాలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. సీనియర్లు అనే అహం తోనే కొంతమంది పార్టీకి వెన్నుపోటు పొడిచారన్నారు. దాని వలన వారితోపాటు పార్టీ శ్రేణులంతా ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది అన్నారు. ప్రతిసారి సీనియర్లమైన తమను పట్టించుకోవడంలేదని చెప్పుకునే నేతలు గడచిన నాలుగు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఆ నేతల వద్ద పార్టీ బలోపేతానికై కృషిచేసిన ఆ తరం నాయకులను, వారి కుటుంబాలను ఎందుకు విస్మరించారన్నారు. చింతపల్లి, జీకే వీధి మండలాలలో పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేసిన దివంగత షేక్ నాజర్ వల్లి, బౌడు రాజారావు, చిన్న రమమూర్తి, బేరా రామలింగం పడాల్, జీకే వీధి మండలానికి సంబంధించి పలాస కొండలరావు లకు పార్టీ పరగా ఎందుకు ఆదుకోలేకపోయారన్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి దివంగతులైన ఆ నాయకుల కుటుంబాలను పరామర్శించడంలోనూ, వారికి న్యాయం చేయడంలోనూ, ఆ కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధినేత దృష్టికి తీసుకువెళ్లడంలోనూ ఈ నేతలు ఎందుకు చొరవ చూపడం లేదని వారు ప్రశ్నించారు. గిరిజనేతరుడైన నాజర్ వల్లి సుమారు 36 ఏళ్ల పాటు ఆ పార్టీ బలోపేతానికి కృషి చేసిన విషయం తెలిసిన సీనియర్ నాయకులంతా ఆయనకు పార్టీ పరంగా ఎందుకు గృహం కల్పించలేకపోయారని వారు ప్రశ్నించారు. నిజాయితీకి మారుపేరుగా పనిచేసిన ఆయన 2022 మార్చి 7న తుది శ్వాస విడిచిన నాటి నుండి ఆ కుటుంబం అన్ని విధాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, పార్టీ సీనియర్లు ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. శిథిలావస్థకు చేరిన పూరిల్లు సైతం ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు కూలిపోయి నిలువ నీడ లేకుండా పోయిందని, ఈ విషయంలో సీనియర్లం అని చెప్పుకునే నేతలు ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని, లేనిపక్షంలో అధినేత దృష్టికి తీసుకువెళ్లి తామే ఆ కుటుంబానికి గృహం ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు.