విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : కనీస జీత భత్యాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు కాంప్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలను బట్టి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ కు కనీస జీత భత్యాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 1999 నుండి రావికమతం సమగ్ర శిశు సంరక్షణ ప్రాజెక్టు పరిధిలో పని చేస్తూ రూ 500లు నుండి రూ.11,500 లు వరకు ఆయా ప్రజా ప్రతినిధులు, అధికార ప్రభుత్వాలు పెంచిన విషయాన్ని తెలియజేసారు. ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి అని, ప్రభుత్వం ఇస్తున్న జీతంతో కుటుంబాలతో నెట్టుకు రావడం కష్టమవుతొందన్నారు. తమ జీత భత్యాలు విషయం పై అధికార ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.