విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం విఘ్నేశ్వరుని గుడి ఎదురుగా ప్రధాన రహదారిలో నివాసముంటున్న ఓ నిరుపేద కుటుంబం అన్నపురెడ్డి వరలక్ష్మి ఇల్లు కూల్చివేసిన సంఘటనలో ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు జిల్లా పంచాయతీ అధికారి (డి.పి.ఎల్.ఓ) ఎస్.ఎస్.ఎస్.ఎన్.మూర్తి మంగళవారం విచారణ చేపట్టారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు చోడవరం మేజర్ పంచాయతీ ఈ.ఓ. నారాయణరావు తో కలసి సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. ‘ డ్రైనేజీ ల ఏర్పాటు కోసం’ అంటూ పంచాయతీ అధికారులు ఇచ్చిన సమాధానం మేరకు అధికారులు పడగొట్టిన భాదితుల ఇంటిని పరిశీలించారు. సంఘటన స్థలంకు సంభందించిన దస్తావేజులు సమర్పించవలదిందిగా బాధితులను కోరారు. విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిస్తామని, తదుపరి ఆదేశాలతో చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు. నిరుపేద బి.జె.పి. కార్యకర్త అయినటువంటి బాధితురాలు వరలక్ష్మీ అనకాపల్లి ఎం.పి. సి.ఎం.రమేష్ కు, తహసీల్దార్ కు ఫిర్యాదు చేయడంతో అధికారుల్లో స్పందన మొదలైంది అన్నారు. ఈ సంఘటనలో ప్రధాన పాత్రధారుడు, సూత్రధారుడు అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, టి.డి.పి. మాజీ ఉప సర్పంచ్ సాగర్, పంచాయతీ కార్యదర్శి నారాయణరావు లను రక్షించేందుకు చోడవరం కూటమి తెలుగుదేశం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు శతవిధాలా ప్రయత్నించారని బి.జె.పి. మాజీ అధ్యక్షుడు బయిన కామేశ్వరరావు ఆరోపించారు. పట్టణ నడిబొడ్డులో ఓ నిరుపేద మహిళ కుటుంబానికి అన్యాయం జరిగి 10 రోజులైనను స్థానిక ఎమ్మెల్యే రాజు పట్టించుకోపోవడమే దీనికి నిదర్శనమన్నారు. సి.పి.ఐ. జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏ.పి. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, అనుబంధ ప్రజా మహిళా సంఘాల మద్దతుతో బాధితుల నిరసనలు మంగళవారంతో 10వ రోజుకు చేరుకున్నాయి. ముందస్తుగా ఎటువంటి నోటీసు, సమాచారం లేకుండగా మాజీ ఉప సర్పంచ్ సాగర్, పంచాయతీ కార్యదర్శి నారాయణరావులు పేదలపై దౌర్జన్యం కు పాల్పడ్డారని, ఉన్నతాధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాల తరఫున డిమాండ్ చేశారు.
అధికారుల అనైతిక చర్యలు వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ శక్తులు కొమ్ము కాస్తున్నారని స్థానికుల ఆగ్రహం చెందారు. ఈ విచారణలో డి.ఎల్.పి.ఓ. మూర్తి వెంట ఈ.ఓ.ఆర్డి చైతన్య, వున్నారు. బాధితుల వెంట బి.జె.పీ. నాయకులు బయినా కామేశ్వరరావు, మండల అధ్యక్షుడు బుద్ధ అమర్ తదితరులున్నారు.