పట్టా ఒకరిది, ఇల్లు వేరొకరిది…. – చనిపోయిన వారు, పట్టణాల్లో వుండే గరీబోళ్ళ పేరు పై బినామీ పట్టాలు… – ఇదే అదునుగా వ్యాపారాలు మొదలెట్టేసిన పంచాయితీ పెద్దలు, బ్రోకర్లు …
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపులో పలు అవకతవకలు జరిగాయని కాలని నిర్వాశితులు ఆరోపిస్తున్నారు. గత వై.సి.పి. ప్రభుత్వ హయాంలో పేదలందరికీ మాజీ సీ.ఎం.జగన్ పేరిట మంజూరు చేసిన ఇళ్లు, పట్టాలు చనిపోయిన వారి పేరు మీద, పట్టణాల్లో నివాసముండే పంచాయతీ పెద్దల పేరుతో కేటాయింపులు చేసారని లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని లక్ష్మీపురం, నర్సయ్యపేట, వెంకన్నపాలెం, దామునాపల్లి తదితర గ్రామాల్లో బినామి ల పేరుతో మంజూరు చేసిన ఇళ్లు, డి- ఫారం పట్టాలను గరీబోళ్ళకు అధిక ధరలకు అమ్ముకొన్న పంచాయతీ పెద్దలు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు లక్షల్లో సొమ్ము చేసుకున్నారు. అసలైన లబ్ధి దారులకు ఏదో వంక పెట్టి, పంచాయతీ పెద్దలు, ఉద్యోగు జగన్ కాలనీ జాబితాలో పేర్లు తప్పించేసారని ఆరోపిస్తున్నారు. కాలని కేటాయింపుల్లో వాటాలు కుదరని చోట ఇప్పుడిప్పుడే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.
జగనన్న ఇళ్లు, పట్టాల పంపిణీ, మంజూరులో నెలకొన్న గందరగోళం, అవినీతి పై ఉన్నత స్థాయి అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని, అసలైన నిరుపేదలు, ఇళ్లు లేని వారికి వాటిని కేటాయించాలని లక్ష్మీపురం నర్సయ్యపేట వెంకన్నపాలెం, దామునాపల్లి తదితర గ్రామాల్లో గల నిర్వాసితులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.