విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.26.02.2024ది. అనకాపల్లి జిల్లా చొడవరానికి చెందిన యువకుడు కోన మణికంఠ ఈ నెల 25న విశాఖలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో విజేతగా నిలిచి ‘ మిస్టర్ ఆంధ్ర ‘ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆంధ్ర జోనల్ శారీరక సౌష్టవ పోటీలలో 70 కేజీల విభాగంలో పాల్గొన్న మణికంఠ రెండవ స్థానం సాధించాడు. విజేతకు ఆడారి ఆనందబాబు చేతుల మీదుగా ధ్రువపత్రం, మెమొంటో, నగదు బహుమతి అందజేశారు. చోడవరం స్టేట్ బ్యాంకు వద్ద చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్న కోన ఈశ్వరరావు, కృష్ణవేణిల సంతానం విజేత మణికంఠ. బాడీ బిల్డింగ్ కసరత్తులు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవని, ఆర్థిక స్తోమత అంత లేదని దాతలు సహకరిస్తే మరింత కష్టపడి మన చోడవరం తో పాటు రాష్ట్రస్థాయిలో పేరు తీసుకు రాగలనని మణికంఠ తెలియజేశాడు. ప్రస్తుతం మణికంఠకు గణేష్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గణేష్, నైస్ జిమ్ లక్ష్మణరావు కోచ్ గా వ్యవహరిస్తున్నారు. మణికంఠ విజయం పట్ల చోడవరంలో పలువురు అభినందనలు తెలియజేశారు.