– తల్లి మురిపెం తో బాటు ముర్రుపాలు శ్రేష్టం …
– ఘనంగా ” భేటీ బచావో, భేటీ పడావో “
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.08.08.2024ది. పోత, పట్టు పాలు కంటే తల్లి పాలే పిల్లలకు ముద్దు అని రావికమతం సమగ్ర శిశు సంరక్షణ అభివృద్ది పథకం (ఐ.సి.డి.ఎస్.) పరిధిలోని అంగన్వాడీ సూపర్వైజర్ లు తెలియజేసారు. ప్రపంచ తల్లి పాలు వారోత్సవాల్లో భాగంగా రావికమతం అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలో గల 78 అంగన్వాడీ కేంద్రాలు కార్యకర్తలు, సూపర్వైజర్ లు, గర్భిణీలు, బాలింతలు తో చోడవరం జెడ్.పి.గర్ల్స్ హై స్కూలు లో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బిడ్డ పుట్టగానే మురిసిపోయే తల్లి, గంటలోగా తన పాలు బిడ్డకు ఇవ్వాలని, వీటినే ముర్రు పాలు అంటారని తెలిపారు. తల్లి ముర్రు పాలల్లోనే బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అన్నారు. ఇదే మొదటి టీకాగా ఉపయోగపడుతుందని తెలియజేసారు. బిడ్డ పుట్టిన కనీసం ఆరు నెలలు వరకు తల్లి పాలే ఇవ్వాలన్నారు. అనంతరం తల్లి పాలు వలన బిడ్డకు కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ లు ఏ.అనిత, డి.శ్రీదేవి, 78 కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.