చోడవరం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ డి. శేఖరం
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.08.08.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం శ్రీ వివేకానంద విద్యాసంస్థల ఆధ్వర్యంలో నడుపబడుతున్న విద్యార్థి డిగ్రీ కళాశాలలో “పొగాకు, మత్తు పదార్థాల నిషేధం” అనే అంశంపై గురువారం విద్యార్థులు, యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చోడవరం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ డి.శేఖరం పాల్గొని మాట్లాడుతూ యువకులు విద్యార్థులు పొగాకు మరియు మత్తు పదార్థాల వాడకంతో చిన్న వయస్సులోనే జీవితాలు చిత్తు అవుతాయని అన్నారు. మత్తు పదార్థాలు వలన కలిగే నష్టాలు, ప్రమాదాలు గురించి వివరించారు, అంతేకాకుండా మత్తు పదార్థాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేర్చే నేపథ్యంలో అమాయక పేద విద్యార్థులు బలవుతున్నారని తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాల వాడకానికి మరియు వాటిని సరఫరా చేయడానికి దూరంగా ఉండాలని ఎవరైనా మత్తు పదార్థాలు వాడుతున్నట్లు తెలిసినట్లయితే నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి తెలియజేయాలని లేదా 100 నెంబరుకు ఫోన్ చేసి చెప్పాలని కోరారు. పొగాకు మరియు మత్తు పదార్థాల నిషేధంలో యువతి కూడా తమ వంతు పాత్రను పోషించాలని, పోలీసులు మరియు పౌరులు కలిసికట్టుగా వ్యవహరిస్తే ఈ నిషేధం జరుగుతుందని తెలియజేశారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చదివినట్లయితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు. అంతేకాకుండా గంజాయి వంటి మత్తు పదార్థాలను ఉపయోగించినా లేదా సరఫరా చేసిన వారికి విధించే చట్ట ప్రకారం విధించే శిక్షలు గురించి క్లుప్తంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.పూసర్ల సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ కీలక పాత్ర పోషిస్తుందని ఆ యొక్క కౌమార దశలో విద్యార్థి తప్పుదారి పట్టకుండా చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉంటే దేశం పురోభివృద్ధి సాధిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.రామారావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పూసర్ల సంతోష్ కుమార్, వేచలపు అర్జున రావు, ఏ.ఓ.చీపురుపల్లి దేముడు నాయుడు మరియు అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.