విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : సహకార రంగంలో అగ్రగామిగా నిలిచి, అన్నింటా అగ్రగామిగా నడుస్తున్న అనకాపల్లి జిల్లాలో గల ది.చోడవరం కో ఆపరేటివ్ (గోవాడ) షుగర్స్ లో పనిచేస్తున్న కార్మికులు సమస్యల పరిష్కారం కోరుతూ బుదవారం ఎం డి. ఛాంబర్ వద్ద షుగర్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ నాయకుడు శరగడం రామునాయుడు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో కార్మిక నేత రామునాయుడు మాట్లాడుతూ కార్మికులు చేసిన పనికి వేతనాలు లేక, చేయడానికి పని లేక కుటుంబాలతో పస్తులు వుండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. క్రషింగ్ సీజన్ ముగిసి ఐదు నెలలు అవుతున్నను కార్మికులను రీకాల్ చేయలేదన్నారు. ఫ్యాక్టరీ లో ఓవరాయిలింగ్ పనులు నేటికీ ప్రారంభించక పోతే, వచ్చే క్రషింగ్ సీజన్ ఎలా ప్రారంభం అవుతుందని ప్రశ్నించారు. ఫ్యాక్టరీ లో కాంటీన్, వైద్యశాల వంటి సదుపాయాలను మూసి వేయడంతో కార్మికులు నానా ఇబ్బందులూ పడుతున్నారని అన్నారు. వైద్యుడ్ని రీ కాల్ చేయాలని, కాంటీన్ లు పునః ప్రారంభం చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో కుమ్మక్కైన యూనియన్ నేతలు కార్మికుల సమస్యలను గాలికి వదిలేశారని అన్నారు. యాజమాన్యం స్పందించి, కార్మికులను, వైద్యుడ్ని రీకాల్ చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాయి సూరిబాబు, దాడి నాగేశ్వరరావు, శరకాన అప్పలనాయుడు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.