విశాలాంధ్ర – పరవాడ (అనకాపల్లి); స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని వాడచీపురుపల్లిలో సీఐటియు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. తొలుత సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ఉపాధి కూలీలతో కలిసి అల్లూరి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం గనిశెట్టి విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు సేవలను కొనియాడారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల హక్కుల కోసం ఉద్యమించడమే కాకుండా ఆయన దేశంకోసం ప్రాణాన్ని త్యాగం చేశారన్నారు. నేటి ప్రభుత్వాలు అల్లూరి స్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తూ గిరిజనుల హక్కులు, చట్టాలను తుంగలోకి తొక్కుతున్నాయన్నారు. తమ హక్కుల కోసం రైతులు, గిరిజనులు, కార్మికులు పోరాడు తున్నారన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడంలో అల్లూరి పాత్ర కీలకమని, అసలు సిసలైన దేశభక్తి కలిగిన వ్యక్తి అల్లూరి సీతారామ రాజే అని పేర్కొన్నారు. బ్రిటీష్ పోలీసుల ఆయుధాలను స్వాధీనం చేసుకొని అదే బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎదురొడ్డిన సింహస్వప్నమని కొనియాడారు. అల్లూరి ఆశయ సాధన కోసం ప్రజా పోరాటాలను విస్తృతం చేయడమే ఆయనకి మనమిచ్చే ఘనమైన నివాళి అని గనిశెట్టి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కార్మికుల సంఘం సిఐటియు నాయకులు పార్వతి, కాసులమ్మ, వరలక్ష్మి, రత్నం, ధనలక్ష్మి, నూకాలమ్మ, అప్పల నరసమ్మ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.