విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ప్రభావితం చేసిన ఆర్నాబ్ తుఫాను నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యల కోసం డిప్లాయ్ చేయబడిన అనంతపురం జిల్లాకు చెందిన అగ్నిమాపక సిబ్బంది విధి నిర్వహణలో చురుకుగా పాల్గొని ప్రజలకు సహాయక సేవలు అందించారని జిల్లా అగ్నిమాపస్ శాఖ అధికారి వి. శ్రీనివాస్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తుఫాను ప్రభావంతో నేలకొరిగిన చెట్లు, విరిగిపడిన చెట్ల కొమ్మలు, రహదారులపై ఏర్పడిన అడ్డంకులు, రాకపోకలకు అంతరాయం కలిగించే ఇతర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిబ్బంది క్షేత్రస్థాయిలో పని చేశారన్నారు . అడ్డంకులను వీలైనంత త్వరగా తొలగించి రహదారులపై రాకపోకలు పునరుద్ధరించేందుకు, ప్రజలకు మరియు వాహనదారులకు ఇబ్బందులు తగ్గించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
అవసరమైన ప్రాంతాల్లో సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ, విపత్తు సమయంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సహాయక చర్యలు నిర్వహించారు. తుఫాను వల్ల ఏర్పడిన అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది చూపిన అప్రమత్తత, సమయస్ఫూర్తి, సమన్వయం మరియు విధి పట్ల నిబద్ధత ప్రశంసనీయం అని పేర్కొన్నారు. విపత్తు సమయంలో ప్రజలకు అండగా నిలవడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన అందించడం అగ్నిమాపక శాఖ ప్రధాన లక్ష్యమని ఈ సేవలు మరోసారి చాటిచెప్పారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ధ్యేయంగా విపత్తు నిర్వహణలో అనంతపురం జిల్లా అగ్నిమాపక సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
ఆర్నాబ్ తుఫాను సహాయక చర్యల్లో అనంతపురం అగ్నిమాపక సిబ్బంది సేవలు
- Advertisement -


