విశాలాంధ్ర` ఉరవకొండ : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ సమావేశం రెండు అంశాలను చర్చించి ఆమోదించడానికి గురువారం సర్పంచ్ మీనుగా లలిత అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా 2006 సంవత్సరంలో గ్రామ పంచాయతీకి చెందిన సర్వేనెంబర్ 560/ఏ2 ఎల్ పి నెంబర్.5/2004లో 40 సెంట్లు స్థలాన్ని ఉరవకొండ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ కి ఇవ్వడం జరిగింది. అయితే గ్రామపంచాయతీ స్థలాన్ని కేటాయించి 16 సంవత్సరాలు కావస్తున్న అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఉన్న పాలకవర్గం ఆ 40 సెంట్లు స్థలాన్ని తిరిగి గ్రామపంచాయతీ స్వాధీనం చేసుకుంటున్నట్లు. తీర్మానాలు చేయడంతో సొసైటీ యాజమాన్యం హైకోర్టుని ఆశ్రయించింది. కోర్టు కూడా 40 సెంట్లు స్థలాన్ని రెన్యువల్ చేసి సొసైటీ కి ఇవ్వాలని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుపై సమావేశంలో కార్యదర్శి చర్చించగా సభ్యులు మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ అంశాన్ని ఆమోదించకుండా వాయిదా వేసింది. మరో అంశం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేయనున్న ఐమాక్స్ లైట్లు, విద్యుత్తు పరికరాల కొనుగోలుకు సంబంధించిన టెండర్లను ఆమోదించేందుకు తీర్మానం ప్రవేశ పెట్టగా కొంతమంది సభ్యులు ఎలాంటి ప్రచారం లేకుండానే టెండర్లను ఆహ్వానించారని వాటిని రద్దు చేయాలని మరి కొంతమంది వార్డు సభ్యులు తక్కువ ధరకే టెండర్లు వేసిన వారికే కేటాయించాలని తెలపడంతో సమావేశంలో కొంతసేపు సభ్యుల మధ్య వాగ్యవాదం జరిగింది. నిబంధనలు మేరకే టెండర్లను నిర్వహించామని గ్రామ కార్యదర్శి గౌస్ సాహెబ్ తెలిపినప్పటికీ సగం మంది సభ్యులు అనుకూలంగా సగం మంది సభ్యులు వ్యతిరేకించడంతో ఈ అంశాన్ని తర్వాత చర్చించి ఆమోదిస్తామని కార్యదర్శి సభ్యులకు తెలియజేశారు. రెండు ప్రధాన అంశాలు చర్చించడానికి ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో ఒక అంశం కూడా ఆమోదించకుండానే సమావేశాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వన్నప్ప, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.