విశాలాంధ్ర-రాప్తాడు : నియోజకవర్గ కేంద్రం రాప్తాడు మండల అభివృద్ధి, సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యమిస్తూనే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి అన్నారు. రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించగా జెడ్పీటీసీ పసుపుల హేమావతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీపీ మాట్లాడుతూ వేసవికాలంలో తాగునీటి సమస్య తీర్చడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. జల జీవన్ మిషన్ పథకం కింద మండలంలో ఇప్పటివరకు ఐదు గ్రామాల్లో పూర్తయ్యాయని మిగతావి త్వరితగతిన పూర్తి చేసి గ్రామాల్లోని ప్రతి ఇంటికి శుద్ధ జలం అందజేస్తామన్నారు. ఇందుకోసం రూ. 2.14 కోట్ల నిధులకు టెండర్లు ఖరారయ్యాయన్నారు. ఉగాది నాటికి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా గృహ నిర్మాణాలు పూర్తయ్యేచర్యలు చేపడతామన్నారు. తహసిల్దార్ లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ భూములు ఎక్కడా అన్యాక్రాంతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపడతామన్నారు. ఇంటి స్థలం ఉండి కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారికి సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లో పొసేషన్ సర్టిఫికెట్లు నిబంధనలకు అనుగుణంగా మంజూరు చేస్తామన్నారు. గ్రామాల్లో అడిగిన ప్రతికూలీకి ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తామన్నారు. వేసవిలో విద్యుత్ సరఫరా లో సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపడతామన్నారు. రైతులు పండ్లతోటలు సాగు చేసేందుకు ప్రభుత్వం చేయూతను అందిస్తుందన్నారు. చెరువుల కింద గతంలో ఉన్న కాలువలు ఆక్రమణలకు గురి కాకుండా చూస్తామన్నారు. విద్య వైద్య వ్యవసాయానికి పెద్దపీట వేస్తామన్నారు కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రత్నాబాయి, వైస్ ఎంపీపీలు వరలక్ష్మి, రామాంజి, అగ్రిబోర్డు ఛైర్మన్ కేశవరెడ్డి, మండలాధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.