Friday, March 24, 2023
Friday, March 24, 2023

ఇల్లు లేని పేద ప్రజల కోసం ప్రత్యక్ష భూ పోరాటం చేస్తాం…

అర్హులైన లబ్ధిదారులకు జగనన్న ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి….
గుంతకల్లులో ఉత్కంఠ నెలకొంది గేట్లు తోసి మున్సిపాల్‌ చాంబర్‌ కార్యాలయాన్ని వంద లాది మంది ముట్టడి…
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్‌
విశాలాంధ్ర.. గుంతకల్లు :
ఇళ్ళు లేని నిరుపేదల అర్జీలు తీసుకున్న 90 రోజుల్లోగా ఇల్లు ఇచ్చి తీరాలని లేకుంటే కసాపురం రోడ్డు లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి పేద ప్రజలకు గుడిసెలు వేసి ఇస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్‌ హెచ్చరించారు.మంగళవారంగుంతకల్లులో ఉత్కంఠ నెలకొంది.మున్సిపల్‌ కార్యాలయం వద్ద సీపీఐ పార్టీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్‌ ఆధ్వర్యంలో సొంత ఇల్లు కోసం లబ్దిదారుల ఘోష కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్‌ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్‌, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు, సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి,సిపిఐ నియోజవర్గం సహాయ కార్యదర్శి బి.మహేష్‌ పాల్గొన్నారు.అనంతరం చాలసేపటికి వరకు మున్సిపల్‌ కమిషనర్‌ అర్జీల స్వీకరణకు రాకపోవడంతో మున్సిపల్‌ కార్యాలయంలోకి వందలాది మంది కార్యకర్తలు లబ్దిదారులు గేట్లు తోసుకుని దూసుకెళ్లారు. అక్కడే ఉన్న పోలీసులు ఎంతగా సీపీఐ నాయకులను లబ్దిదారులను వారించినా కార్యాలయంలోకి వచ్చారు. దీంతో పోలీసులకు..సీపీఐ నాయకులకు తోపులాట జరిగింది. కమిషనర్‌ ఛాంబర్‌ ముట్టడిరచి చాంబర్‌ ముందు సీపీఐ నాయకులు బైఠాయించి ధర్నా చేశారు. టూటౌన్‌ సిఐ గణేష్‌ ఆందోళన కారులకు ఒప్పించి అర్జీలను కమిషనర్‌ స్వీకరిస్తారని హామీ ఇవ్వడంతో అక్కడ నుంచి కార్యక్రమం జరిగే చోటుకు సీపీఐ నాయకులు లబ్దిదారులు వెళ్లడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కమిషనర్‌ బండి శేషన్న,మున్సిపల్‌ చైర్మన్‌ భవాని లు లబ్దిదారుల నుంచి అర్జీలు తీసుకున్నారు.అనంతరం సీపీఐ నాయకులు వంటా వార్పు కార్యక్రమం నిర్వహించి,లబ్దిదారులకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్‌ మాట్లాడుతూ 90 రోజుల్లో అర్జీలు ఇస్తే ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్‌ రెడ్డి ఈరోజు పట్టణంలో 6వేల మందికి ఇల్లు ఇచ్చామని అయితే ఇంకా ఇల్లు లేని వారు ఎవరు లేరని కమిషనర్‌ చెప్పినట్లు తెలిపారు.అయితే గుంతకల్లులో ఈరోజుకి ఇంకా ఇల్లు లేని ప్రజలు 15 వేల మంది వరకు ఉన్నారని తెలిపారు. మీరు చెప్పిన కూత ప్రకారం మీరు ఇచ్చిన మాట ప్రకారం 90 రోజుల్లోగా ఇప్పుడు ఇచ్చిన అర్జీల లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చి తీరాలని లేకపోతే మీ నాయన జాగీరు కాదని మీ అమ్మ ఆస్తి కాదని హెచ్చరించారు. లేనిపక్షంలో కసాపురం రోడ్లో ఎమ్మార్వో ఆఫీస్‌ దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు లేని పేద ప్రజలకు గుడిసెలు వేసి ఇస్తామని హెచ్చరించారు. గతంలో గుంతకల్లు పట్టణంలో కమ్యూనిస్టు పోరాటలతో బీటీ పకీరప్ప కాలనీ, పాత గుంతకల్లు హమాలి కాలనీ, గుడిసె గిరి,నాగప్ప కాలనీ ,బస్టాండు దగ్గర ,హెచ్‌ జే యి హై స్కూల్‌ దగ్గర సుమారు కమ్యూనిస్టు ఆధ్వర్యంలో 15వేల మందికి జాగా ఇచ్చి పట్టాలిచ్చామన్నారు. రాష్ట్రంలో జగనన్న ఇల్లు 44 గజాలు మాత్రం ఇచ్చారని అయితే అందులో ఒక్క సెంటు కూడా లేదు. అది బాత్రూం కి సరిపోయేంతగా ఉందన్నారు. ఎమ్మెల్యే ,ఎంపీ ఇళ్లల్లో ఇలాగే 44 గజాల్లో బెడ్‌ రూమ్‌ లు ఉన్నాయని ప్రశ్నించారు. ఒక కుటుంబం ఉండాలంటే 44 గజాల్లో ఏ విధంగా జీవనం సాగిస్తారని ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదని అన్నారు పిచ్చోడి ప్రభుత్వమో తలకాయ లేని ప్రభుత్వమో అని అర్థం కావడం లేదన్నారు. జగనన్న ఇళ్లకు 1 లక్ష 80 వేలు ఏ మాత్రం సరిపోదని సిమెంటు,ఇసుక ,కూలీలు, తదితర వాటికి అధిక ధరలు పెరిగిపోయాయని అన్నారు. ఇచ్చిన స్థలాలు కట్టుకోకుంటే యమకింకర్లుగా వాలంటీర్లు వచ్చి లబ్ధిదారులను భయపెడుతున్నారని తెలిపారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు ఐదు లక్షల ఇవ్వాలని 26 జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు అయితే కేరళలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం 4 లక్షల 80 వేలు ఇచ్చిందని,పక్కన రాష్ట్రం తెలంగాణలో 4 లక్షలు ఇచ్చిందన్నారు. అయితే జగనన్న లబ్ధిదారులకు ఐదు లక్షలు ఇవ్వాలని అదేవిధంగా టిడ్కో ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు ఇవ్వాలని, ఇళ్ళు లేని వారికి నివాస స్థలాలు ఇవ్వాలని జనవరి 17వ తారీకు నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఫిబ్రవరి 6 వ తారీకు వరకు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.అదేవిధంగా విజయవాడలో ఫిబ్రవరి 22వ తారీఖున జరుగు మహాధర్నా కు లక్షలాది మందితో నిరసన చేపట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలిపారు.అదేవిధంగా రైఫుల్‌ రేంజ్‌ కాలనీలో 70 సంవత్సరాలుగా నివసిస్తున్న వారికి గవర్నమెంట్‌ ఆర్డర్‌ చేసి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్‌ఎండి గౌస్‌ ,సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్‌ ,సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పిసి కుల్లయప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేంద్ర, సిపిఐ నాయకులు మల్లయ్య మురళీకృష్ణ,ఉమ్మర్‌ బాషా, పుల్లయ్య ,ప్రసాద్‌, రామాంజనమ్మ ,లక్ష్మీనారాయణ ,ఏ ఐఎస్‌ ఎఫ్‌ నియోజవర్గం కార్యదర్శి వెంకట నాయక్‌ ,నియోజవర్గం ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వినోద్‌ కుమార్‌ ,పట్టణ కార్యదర్శి చంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img