విశాలాంధ్ర-రాప్తాడు : చదువుకున్న ప్రతి ఒక్కరూ విజ్ఞాన సముపార్జన కోసం గ్రంథాలయాలను వినియోగించుకోవాలని గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి రమాదేవి సూచించారు. వేసవి శిక్షణ శిబిరం సందర్భంగా శుక్రవారం రాప్తాడు గ్రంథాలయాన్ని ఆమె అకస్మిక తనిఖీ చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులు చేత కథల పుస్తకాలు చదివించడంతోపాటు కథలు చెప్పించారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ప్రజలను మేలుకోలిపె జాగృత జ్యోతులుగా, సామాజిక విజ్ఞాన కేంద్రాలుగా, సాంఘిక ఉద్యమాలకు వ్యూహ నిర్మాణ స్థావరాలుగా గ్రంథాలయాలు దేదీప్యమానంగా వెలుగొందాయన్నారు. డిగ్రీ పూర్తయిన విద్యార్థులు ఉద్యోగాల కోసం శిక్షణ పొందేందుకు అన్ని రకాలైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి వి.వీరనారాయణరెడ్డి, సహాయకురాలు ముత్యాలమ్మ విద్యార్థులు పాల్గొన్నారు.