Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

గ్రామాల్లో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించండి

విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి ఆదేశించారు. రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీఓ సాల్మన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. బొమ్మేపర్తిలో పంచాయతీ బోరుకు సంబంధించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తరచూ మరమ్మతులకు గురవుతోందని పరిష్కరించడంలో అధికారులు దృష్టిపెట్టడం లేదని సర్పంచ్ ఆనందరెడ్డి ప్రశ్నించారు. రాప్తాడు పంచాయతీలో విద్యుత్ వీధిలైట్లు నిరంతరం వెలుగుతున్నాయని, అదేవిధంగా గృహాలు ఎక్కువగా ఉండడం వల్ల అధిక విద్యుత్ లోడుతో ఇళ్లల్లో లైట్లు ఫెయిల్ అవుతున్నాయని అదనంగా మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని, రామనేపల్లిలో ఒక ఇంట్లో విద్యుత్ స్థంభం ఉందని, బయటకు మార్చాలని సర్పంచ్ సాకే తిరుపాలు కోరగా వారం రోజుల్లో పరిష్కరిస్తామని ఏఈ రమాదేవి తెలిపారు. వైఎస్సార్ ఆసరా నగదు ఇంకా కొంతమంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమకాలేదని గొందిరెడ్డిపల్లి సర్పంచ్ మిడతల శీనయ్య అడగ్గా త్వరలోనే అందరి ఖాతాల్లో జమవుతాయని ఏపీఎం శివకుమార్ తెలిపారు. జేజేఎంపై ఆర్డబ్ల్యూఎస్ఎ ఏఈ వెంకటేష్ ను ఎంపీపీ అడగ్గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జల్ జీవన్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయిలు వేయడానికి రూ.4.68లక్షలు మంజూరయ్యాయని, 2024లోపు పనులు పూర్తి చేస్తామన్నారు. లబ్ధిదారులే పథకాన్ని సంరక్షించుకునేలా గ్రామీణ తాగునీరు, పారిశుద్ధ్య కమిటీలు ఏర్పాటు
చేస్తామన్నారు. నిత్యావసర వస్తువుల సమస్యలపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని తహశీల్దార్ లక్ష్మీనరసింహ తెలిపారు. జగనన్న ఇళ్లు పురోగతిలో ఉన్నాయని హౌసింగ్ ఏఈ రామమూర్తి తెలిపారు. పాడి పశు సంరక్షణ కోసం సమగ్ర చర్యలు చేపట్టామని వెటర్నరీ డాక్టర్ సోమేశ్వరి తెలిపారు.
కార్యక్రమంలో ఈఓఆర్డీ మాధవి, ఏఓ రత్నాబాయి, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img