విశాలాంధ్ర – పెద్దకడబూరు :నకిలీ విత్తనాలను అరికట్టాలంటూ శనివారం రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మండల వ్యవసాయ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ మాట్లాడుతూ గ్రామాలలో మధ్య దళారులు అధిక ధరలకు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారని ఆరోపించారు. గత సంవత్సరం నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పెట్టుబడులు కూడా చేతికి రాలేదన్నారు. నకిలీ విత్తనాలను అరికడతామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో ఏ మాత్రం చర్యలు తీసుకోలేదన్నారు. విత్తనాలు అమ్మే డీలర్లు ఏ విత్తనానికి తాము గ్యారంటీ ఇవ్వమని చెబుతున్నారని తెలిపారు. రసాయనిక ఎరువులు కూడా కల్తీ వస్తున్నాయని, అధికారులు గుర్తించి నకిలీ విత్తనాలను, ఎరువులను అమ్మే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మన్న, రమేష్, రాగన్న, చెక్క లసుమన్న, రామాంజనేయులు, కోతి లక్ష్మన్న, ఎర్రి స్వామి తదితరులు పాల్గొన్నారు.