. పంటను నాశనం చేస్తున్న కత్తెర పురుగు
విశాలాంధ్ర – చిలమత్తూరు రూరల్ : శ్రీ సత్య సాయి జిల్లా మొక్కజొన్న పంటను కత్తెర పురుగు నిండా ముంచేస్తోంది. మొలక దశ నుంచే తీవ్రస్థాయిలో దాడి చేస్తోంది. దీని నివారణ రైతులకు ఆర్థికభారంగా మారుతోంది. నిన్న మొన్నటి వరకు తీవ్ర వర్షాభావంతో సగం పంట దెబ్బతింటే ప్రస్తుతం కాస్తోకూస్తో ఉన్న పంటను కత్తెర పురుగు నాశనం చేస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలం లో మొక్కజొన్న సాగువైపు ఆసక్తి చూపుతున్న రైతుల్లో పురుగుదాడి కలకలం రేపుతోంది.ప్రస్తుత ఖరీఫ్‌లో మండల వ్యాప్తంగా దాదాపు 2517 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో పంటకు పట్టిన పురుగులు నాశనమయ్యాయి. మరికొన్ని చోట్ల అనుకున్న స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో బెడద తగ్గలేదు. దీంతో పంటను రాత్రికిరాత్రే పురుగులు నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు, కత్తెర పురుగు జీవితకాలం 30 రోజులు. ఇదీ 1,300 నుంచి 2,000 గుడ్లు పెడుతుంది. రాత్రివేళల్లో సుమారు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. పంటను రాత్రికి రాత్రే నాశనం చేయగలదు. గతంలో ప్రభుత్వం కత్తెర పురుగు నివారణ మందును రాయితీపై రూ.150లకే అందించేది. ప్రస్తుతం దీన్ని నిలిపివేసింది. బయట మార్కెట్లో కొనాలంటే ఎకరాకు సుమారు రూ.800 నుంచి రూ.1200 వరకు ఖర్చవుతుంది. దీనిని పిచికారీ చేసేందుకు రూ.600. ఇలా ఎకరానికి పురుగు ఉద్ధృతి ఆధారంగా రెండు నుంచి నాలుగు సార్లు పిచికారీ చేయాల్సి వస్తోంది.
ఒక్కో మొక్కలో పదుల సంఖ్యలో కత్తెర పురుగులు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో రూ.వేలల్లో నష్టం తప్పడం లేదు. వారానికోసారి నివారణ మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. ఇప్పటికే దుక్కులు, ఎరువులు, విత్తనాలు, కలుపు నివారణ ఇతర ఖర్చులకు ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్యలో పెట్టుబడి పెట్టామని, ప్రస్తుతం కత్తెర పురుగు నివారణకు అధిక మొత్తంలో వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు అంటున్నారు. పంట వేసిన కొద్ది రోజుల్లోనే కత్తెర పురుగు సోకింది. ఎకరా పొలానికి పురుగు నివారణకు రెండుసార్లు మందు పిచికారీ రూ.4 వేలు వెచ్చించి చేసినను ఫలితం లేకపోయింది. ఇలా రెండెకరాలకు రూ.8 వేల పెట్టుబడి పురుగుమందులకే ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో ప్రస్తుతం పెట్టుబడులు కుడా రాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మండల వ్యవసాయాధికారి, వంశీకృష్ణ మాట్లాడుతూకత్తెర పురుగు నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. వీటిని తొలిదశలోనే నివారించుకోవాలి. వ్యవసాయాధికారుల సూచనల మేరకు పురుగు మందులు వినియోగించాలి. వర్షాలు ఎక్కువగా ఉంటే పురుగు ఉద్ధృతి తగ్గుతుంది. రాయితీపై ఎటువంటి మందులు సరఫరా చేయడం లేదు. మండలాల్లో ఈ-క్రాప్ పంటలు నమోదు ప్రక్రియ జరుగుతుంది. ఖరీఫ్‌లో మొక్కజొన్న కంటే మిగిలిన పంటలపై దృష్టి సారిస్తే మేలు అంటూ సూచనలు ఇచ్చారు.