Monday, January 30, 2023
Monday, January 30, 2023

రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం

12న కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆందోళన
సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి

విశాలాంధ్ర`ఉరవకొండ : అనంతపురం జిల్లాలో అధిక వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అందుకు నిరసనగా ఈనెల 12వ తేదీన జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి అన్నారు. బుధవారం ఉరవకొండ లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆందోళనకి సంబంధించిన పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అధిక వర్షాలకు పంటలు నష్టపోయిన పొలాలను గతంలో సిపిఐ పార్టీ జిల్లా బృందం పర్యటించిందని రైతుల పడుతున్న బాధలను కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగిందని అయినప్పటికీ ప్రభుత్వం రైతులకు పరిహారం మంజూరు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. రైతుల కోసం మరోసారి ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వైసిపి నాయకులు మాత్రం తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప రైతులకు మాత్రం ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు అన్ని రకాల లబ్ధి చేకూరుతుందని గొప్పలు చెప్పారని అయితే వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం రైతులకు లేదన్నారు. పంటలు నష్టపోయిన పొలాలని పరిశీలించడం కానీ, రైతులకు జరిగిన నష్టాలను తెలుసుకోవడానికి గానీ జిల్లాలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారన్నారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్తు తీసుకొస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విద్యుత్‌ మోటార్లకు మీటర్లను బిగించి రైతులకు ఉచిత విద్యుత్‌ దూరం చేస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఒక్క కిలోమీటర్‌ కూడా పనులు చేయలేదన్నారు హంద్రీ-నీవా, పీఏబీఆర్‌ ఆయకట్ట స్థిరీకరణ పనులు చేయకపోవడం శోచనీయమన్నారు ఈ సంవత్సరం జిల్లాలో అధిక వర్షాలు రావడం వల్ల జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తిస్థాయిలో నిండి అనేక టీఎంసీల నీరంతా వృధాగా దిగువకు వెళ్లి పోయిందన్నారు. 10 టిఎంసిల నీరు నిలువ ఉండాల్సిన పీఏబీఆర్‌ డ్యాం నాసిరక నిర్మాణం వల్ల కేవలం ఐదు సీఎంలు మాత్రమే నిల్వ ఉందన్నారు. హంద్రీ-నీవా కాలువకు ఫిబ్రవరి చివరి వరకు కూడా నీరు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ డిసెంబర్‌ చివరి నాటికి నీటిని నిలుపుదల చేస్తున్నట్లు అధికారుల ప్రకటించడం వల్ల వేలాది ఎకరలలో రైతులు సాగుచేసిన స్టాండిరగ్‌ పంటలు చేతకందక ఎండిపోతాయన్నారు. విద్యుత్‌ బిల్లులు చెల్లించలేక ప్రభుత్వం హంద్రీ-నీవా కాలువకు నీటిని నిలుపుదల చేయడం సిగ్గుచేటు అన్నారు. జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల వల్ల అనేకమంది రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు రైతులకు సబ్సిడీతో అందించే వ్యవసాయ పరికరాలకు కూడా జీఎస్టీ ని అమలు చేయడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళింది అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిత్యం కరువు కాటకాలకు గురవుతున్న అనంతపురం జిల్లా రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక చొరవ చూపాలన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేయాలని రైతుల రుణాలన్నిటిని రద్దు చేయాలని ఈ క్రాప్‌ తో సంబంధం లేకుండా పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇవ్వాలని, టమోటా ప్రాసెసింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని జిల్లాకు వంద టీఎంసీల నీటిని కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12వ తేదీన అనంతపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు సిపిఐ మరియు అనుబంధ రైతు సంఘం సంయుక్తంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు, కూలీలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ తాలూకా కార్యదర్శి మల్లికార్జున, సహాయ కార్యదర్శిలు వన్నూరు సాహెబ్‌, రైతు సంఘం తాలూకా ప్రధాన కార్యదర్శి మనోహర్‌, ఏఐటీయూసీ జిల్లా నాయకులు చెన్నారాయుడు, మహిళా సంఘం జిల్లా నాయకురాలు పార్వతీ ప్రసాద్‌, ఉరవకొండ మండల సిపిఐ నాయకులు మల్లికార్జున గౌడ్‌, గణపమల్లి,రవికుమార్‌,వజ్రకరూరు కార్యదర్శి కార్యదర్శి, సుల్తాన్‌, హనుమంతు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రమణ కూడేరు పార్టీ నాయకులు నబిరసులు శ్రీరాములు, విడపనకల్లు మండల కార్యదర్శి రమేష్‌, విద్యార్థి సంఘం నాయకులు పెన్నా ఓబులేసు, మహిళా సంఘం నాయకులు వన్నూరమ్మ, నూర్జహాన్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img