Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

రైతు సంఘం నాయకులు మనోహర్‌
విశాలాంధ్ర` ఉరవకొండ : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ పార్టీ అనుబంధ ఏపీ రైతు సంఘం ఉరవకొండ తాలూకా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ అన్నారు. బుధవారం ఉరవకొండ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతులకు ఒరిగింది ఏమీ లేదన్నారు. అనంతపురం జిల్లాలో గత రెండు సంవత్సరాలుగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం మరియు బీమా మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు రైతులకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ కేవలం లక్ష రూపాయలు లోపు మాత్రమే రుణాలు తీసుకున్న రైతులకు వర్తింప చేసిందని అది కూడా నామ మాత్రంగా అమలు చేయడం వల్ల ఎక్కువ శాతం రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. కౌలు రైతులకు అనేకమందికి గుర్తింపు కార్డులు ఇచ్చినప్పటికీ వారికి చట్టం ప్రకారం అందాల్సినవి ఏవి కూడా అందడం లేదన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఇరిగేషన్‌ అభివృద్ధికి మెగా డ్రిప్‌ సిస్టం ఏర్పాటు చేసిందని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రిప్‌ సిస్టం అమలు చేయలేదన్నారు గతంలో హంద్రీనీవా కాలువకు ఫిబ్రవరి చివరి వరకు మీరు వచ్చేదని గత రెండు సంవత్సరాల నుంచి డిసెంబర్‌ చివరికి నీటిని నిలుపుదల చేస్తున్నారని దీనివల్ల కాలువ నీటిపై ఆధారపడి పంటలు సాగు చేసుకున్న అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. స్టాండిరగ్‌ పంటలను కాపాడడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఉత్సవ కేంద్రాలుగా మారాయి తప్ప రైతులకు దీని వల్ల ఉపయోగం లేదన్నారు గడిచిన మూడు సంవత్సరాల కాలంలో రైతులకు సబ్సిడీతో అందాల్సిన వ్యవసాయ పరికరాలను ప్రభుత్వం అందించలేక పోయిందన్నారు ప్రస్తుతం వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రకటించడం రైతులను మోసం చేయడం తప్ప మరొకటి కాదన్నారు. హంద్రీనీవా మరియు పీఏబీఆర్‌ డ్యాం అనుబంధంగా జరగాల్సిన డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తిగా ఆగిపోయాయని భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించడంలో కూడా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని రైతులకు ఎలాంటి జీఎస్టీ లేని సబ్సిడీ వ్యవసాయ పరికరాలు అందించాలని. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు విత్తనాలు అందించి పంటలు కూడా కొనుగోలు చేయాలన్నారు. డ్రిప్పు పనులు వేగవంతంగా చేపట్టాలని,హంద్రీనీవా కాలువకు ఫిబ్రవరి చివరి వరకు నీటిని అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో రైతు సంఘం ఉపాధ్యక్షులు నాగరాజు, మల్లికార్జున గౌడ్‌, రామకృష్ణ,తలారి మల్లికార్జున రజాక్‌ షేక్‌ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img