విశాలాంధ్ర-రాప్తాడు : గ్రామాల్లోని ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి ఇవ్వాలనే సదుద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా అనంతపురం రూరల్ మండలం చిన్నంపల్లి గ్రామాన్ని 100శాతం హర్ ఘర్ జల్ గ్రామంగా ధ్రువీకరించారు. జేజేఎం, ఆర్డబ్య్లుఎస్, రైజెస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, సర్పంచ్ శివశంకర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం గ్రామసభ నిర్వహించారు. జేజేఎం ఐఈసీ జిల్లా కోఆర్డినేటర్ నరేశ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ తాగునీటిని ఇచ్చేలా కృషి చేసిన ప్రభుత్వం 15మంది సభ్యులతో కూడిన వీడబ్ల్యూఎస్ కమిటీ ద్వారా నీరు వృథా కాకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. గతంలో నీటి కోసం ఇంటి పనులు వదులుకుని చెరువులు, కుంటల వద్దకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేదని ఇప్పుడు ప్రతి ఇంటికీ జేజేఎం ద్వారా కుళాయి అమర్చడం వల్ల నీటికష్టాలు తీరాయన్నారు. వీడబ్ల్యూఎస్సీ కమిటీ ద్వారా మూణ్ణెళ్లకోసారి గ్రామసభ ఏర్పాటు చేసుకుని తమవంతుగా కమిటీ ఖాతాలో కొంతసొమ్మును జమచేసి ఏవైనా మరమ్మతులు తలెత్తినప్పుడు నీటి నిర్వహణకు చేయూతనందించాలన్నారు అనంతరం సర్పంచ్ సమక్షంలో పంచాయతీ కార్యదర్శి మల్లికార్జునరెడ్డికి జేజేఎం ప్రతినిధులు హర్ ఘర్ జల్ దృవీకరణ పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, రైజెస్ ఐఈసీ కోఆర్డినేటర్ కమ్మూరు శీనా, సోషల్ మొబలైజర్ ఓబులపతి, గ్రామప్రజలు పాల్గొన్నారు.