Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అప్పుల ఊబికి మరో చేనేత కార్మికుడు ఆత్మహత్య

పరామర్శించిన సిపిఐ, సిపిఎం నాయకులు
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని రామ్ నగర్ నివాసముండు మరో చేనేత కార్మికుడు పూజారి రాము (32) అప్పుల ఊబికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి… మృతుడు పూజారి రాముతో పాటు భార్య పద్మావతి చేనేత వృత్తిని నమ్ముకుని కొన్ని సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నారు. మృతుడు సంధ్యా రాఘవ మగ్గాల బిల్డింగులు అద్దెకు ఉంటూ కూలి మగ్గం చేస్తూ ఉండేవాడు. ముడి సరుకు ధరలు పెరగడం, కరోనా సమయంలో జీవనం కష్టతరం కావడం వలన కుటుంబ పోషణ చాలా భారమైనది. నేసిన చీరలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో కుటుంబ పోషణ చదువుల నిమిత్తం దాదాపు 5 లక్షల వరకు అప్పులు చేయడం జరిగింది. ఈ క్రమంలో అప్పుల వాళ్ళ ఒత్తిడి అధికం కావడంతో, అప్పులు ఎలా తీర్చాలో అని మనోవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున ఇంటిలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికులు, హుటాహుటిన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు పరీక్షించిన తర్వాత మృతి చెందినట్లు వారు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు అభినయ్, ప్రేమ్ అభిజితులు ఉన్నారు. ప్రభుత్వమే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు స్థానికులు కోరుతున్నారు.
కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ, సిపిఎం నాయకులు:: చేనేత కార్మికుడు మృతి చెందిన విషయాన్ని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింక చలపతి-సిపిఐ, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు, సిపిఎం నాయకులు పెద్దన్న, ఎన్హెచ్ భాష, ఆదినారాయణ, సిపిఐ నాయకులు వెంకటస్వామి, భుజంగం తదితరులు పరామర్శించి, ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు అధికమయ్యాయని, వీటికి గల కారణం ప్రైవేట్ వ్యక్తుల నుండి చేనేత కార్మికుల అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వాటిని తీర్చలేక చివరకు బలవన మరణాలకు పాల్పడం బాధాకరమన్నారు. కరోనా సమయంలో చేనేత కార్మికులు పూర్తిగా నష్టపోయారని నేటికీ కూడా ముడి పట్టు సరుకులు ధరలు అధికం కావడం దారుణం అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. అంతేకాకుండా ఇప్పటివరకు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను వెనువెంటనే ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img