Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉద్యోగులను ఉపాధ్యాయులపై కక్ష్యగట్టిన వైసిపి ప్రభుత్వం

విశాలాంధ్ర-రాప్తాడు : వైసీపీ అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పిన వైఎస్ జగన్ మాట తప్పి మడమ తిప్పేశారని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సి.మల్లికార్జున ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా శుక్రవారం రాప్తాడు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉద్యోగుల టిఎ, డిఎ బకాయిలు వెంటనే చెల్లించాలని, ప్రతినెల ఒకటవ తేదీన జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. అపరిష్కృతంగా ఉన్న వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజా భద్రత కోసం నిరంతరం శ్రమించే పోలీసులకు కూడా వారానికి ఒకసారి ఇస్తామని చెప్పిన సెలవును ఖచ్చితంగా అమలు చేయాలన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారంరోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని ఇచ్చినా దానిపై డొంక తిరుగుడు మాటలు చెబుతూ నాలుగేళ్లుగా కాలం వెళ్లదీస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని విరుచుకుపడ్డారు.
ఓపీఎస్ ను పునరుద్ధరించి ఉద్యోగుల జీవితాలకు భరోసా కల్పించాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఏ చిన్న ఆందోళనకు పూనుకున్నా వారిని అరెస్టులు, గృహనిర్బంధాలు చేసిందని వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను విరమించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పై ఉద్యోగులకు నమ్మకం పోయిందని వారికి రావాల్సిన రూ.వేలకోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు నెలసరి జీతాలకూడా సమయానికి ఇవ్వలేని వైసిపి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ మెడలు వంచేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు తమసత్తా నిరూపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ముఖ్య అతిథులుగా సిపిఐ రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి పి. రామకృష్ణ, సహాయ కార్యదర్శి జి.శ్రీకాంత్, రూరల్ మండల కార్యదర్శి రమేష్, రాప్తాడు మండల సహాయ కార్యదర్శి చలపతి, రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి వెంకటనారాయణ, ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి ధనుంజయ, ఆటో యూనియన్ రాజు, సిపిఐ నాయకులు జి. రామాంజనేయులు, టి.రామాంజనేయులు, మౌలాలి, రసూల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img