Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎన్నికల కౌంటింగ్‌ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి వెల్లడి
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం : ఆదివారం నిర్వహించే ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్‌ కోసం కౌంటింగ్‌ కేంద్రాల్లో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి పేర్కొన్నారు. శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలను హౌసింగ్‌ జాయింట్‌ కలెక్టర్‌ నిశాంతితో కలిసి జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్‌ కోసం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశామని, ఈనెల 19వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలవుతుందని తెలిపారు. కౌంటింగ్‌ కోసం ఎన్నికల సిబ్బందికి, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. కౌంటింగ్‌ కోసం రిటర్నింగ్‌ అధికారులను, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమించామని, అభ్యర్థులు, రాజకీయ పార్టీల తరఫున వచ్చే ఏజెంట్లకు గుర్తింపు కార్డులను ఇవ్వడం జరిగిందన్నారు. ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్‌ లో కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో శానిటైజ్‌ చేయడం చేయాలని, అన్ని చోట్ల శానిటైజర్‌ లు, మాస్కులు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు కౌంటింగ్‌ కోసం వచ్చే ఏజెంట్లు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌, వ్యాక్సినేషన్‌ పూర్తయిందనే మెసేజ్‌ తీసుకురావాలని, వ్యాక్సిన్‌ వేసుకోని వారికి ఈరోజు అన్ని పిహెచ్సి లలో, కౌంటింగ్‌ కేంద్రాల్లో రాపిడ్‌ యాంటిజెన్‌ కిట్‌ తో టెస్టింగ్‌ సౌకర్యాలు ఏర్పాటు చేశామని, టెస్ట్‌ చేయించుకుని నెగెటివ్‌ రిపోర్ట్‌ తీసుకొని రావాలన్నారు. కోవిడ్‌ నిబంధనల మేరకు గెలిచిన వారికి సర్టిఫికెట్‌ అందించేటప్పుడు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. గెలిచినవారు ఎలాంటి వేడుకలు నిర్వహించేందుకు అనుమతి లేదన్నారు. కౌంటింగ్‌ నేపథ్యంలో 144 సెక్షన్‌ అమలు చేస్తామన్నారు. మద్యం షాపులను మూసివేశామన్నారు. ఎన్నికల కౌంటింగ్‌ సజావుగా నిర్వహించేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ కోరారు.అంతకుముందు జిల్లా కలెక్టర్‌ కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించి అన్ని ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రాలలో టేబుల్స్‌ ఏర్పాటు చేయాలని, అవసరమైన మెటీరియల్‌ సిద్ధంగా ఉంచాలని, తాగునీటి ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పద్ధతి ప్రకారం ఫలితాలను ప్రకటించాలన్నారు. కౌంటింగ్‌ హాల్‌ లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, కౌంటింగ్‌ కోసం వచ్చే వారికి పార్కింగ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద షామియానాలు ఏర్పాటు చేయాలని, ఏ మండలానికి సంబంధించి ఎక్కడ కౌంటింగ్‌ చేస్తారు అనేది సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్‌ ను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ నిశాంత్‌ రెడ్డి, డిఎస్పీ అంథోనప్ప, తహసీల్దార్‌ లు బ్రహ్మయ్య, బాలకిషన్‌, అనిల్‌ కుమార్‌, ఉషారాణి, రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img