Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉద్యమ నాయకులనే అఖండ మెజార్టీతో గెలిపిద్దాం

విశాలాంధ్ర`కదిరి : పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న కత్తి నరసింహారెడ్డి, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు లను అఖండ మెజార్టీతో గెలిపిద్దామని మాజీ ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ఉపాధ్యక్షులు వేమయ్య యాదవ్‌ తెలిపారు. మంగళవారం స్థానిక ఎన్జీవో హోం భవనంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లం రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థులు కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజు లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో దోచుకోవడం దాచుకోవడమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న దోపిడీని ప్రశ్నించాలన్న నిలదీయాలన్న స్ఫూర్తితో పోటీ చేయడం జరుగుతుందని తెలిపారు. పాలకులు మతాల పేరుతో కులాల పేరుతో ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకుండా పాలన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లిక్కర్‌ మాఫియాను సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యాపారం చేస్తున్నారని, లిక్కర్‌ మాఫియా వలన అభం శుభం తెలియని ఆడపిల్లలు కామాంధుల చేతులు బలైపోతున్నారని, ఇలాంటి పాలకులు పాలన చేతకాకపోతే తప్పుకోవాలని పాలన ఎలా చేయాలో చేసి చూపిస్తామని అన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ మాజీ జాతీయ ఉపాధ్యక్షులు ఎం వేమయ్య సిఐటియు నాయకులు మాట్లాడుతూ నేడు జరుగుతున్న అక్రమాలు, దోపిడీలను భవిష్యత్‌ తరానికి తెలియజేసే బాధ్యత మనపై ఉందని, విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, పకృతి సంపదను కొల్లగొట్టే వ్యక్తులు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఓటర్లను మభ్య పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, దొంగ చాటున గెలవడానికి ఎత్తుగడ పన్నుతున్నారని తెలియజేశారు. తప్పుడు వాగ్దానాలతో అధికారం చేపట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దుర్మార్గపు రాజకియాలు, అణిచివేత రాజకీయాలు అత్యంత నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని లేకుంటే రాష్ట్రాన్ని రావణ కాష్టంగా కావడం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమం ఉండదని కేవలం జగన్మోహన్‌ రెడ్డి సంక్షేమమే ఉంటుందని నిత్య శ్రామికులు ఉద్యమ నాయకులు కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజు లకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడానికి మనమందరం కలిసికట్టుగా పనిచేసే వారి గెలుపుకు కృషి చేద్దాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌, మాజీ ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు,ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఇసాక్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబ్జన్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వివి రమణ, సుబ్బిరెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేష్‌, ఉపాధ్యక్షులు జిఎల్‌ నరసింహులు,ఏఐకేఎస్‌ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హనుమంత్‌ రెడ్డి, జీవీ రమణ,ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి బిల్లుకుల్లాయప్ప, సాహితీ కుమార్‌ స్వామి రెడ్డి అంగనవాడి జిల్లా అధ్యక్షులు మాబునిస,ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు నల్లజోడు పవన్‌, శేష మహేంద్రా, ఏఐటీయూసీ పట్టణ నాయకులు లియాకత్‌ అలీ, ముబారక్‌, నరసింహులు, సిఐటియు నాయకులు సాంబశివ, జగన్మోహన్‌ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img