Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని సాగునీటి ప్రాజెక్టులు

పోలవరానికి నిధులివ్వకుండా మొండికేసిన కేంద్రం
ఎన్నికల లబ్ది కోసమే అప్పర్‌ భద్రా కు 5,300 కోట్లు
అప్పర్‌ భద్రా నిర్మిస్తే రాయలసీమ ఎడారికాక తప్పదు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర-అనంతపురం అర్బన్‌ : గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఒక్క నీటి ప్రాజెక్టు కూడా అభివృద్ధికి నోచుకోలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఏపీ సాగునీటి ప్రాజెక్టులపై 8 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రామక్రిష్ణ నేతృత్వంలో ఆపార్టీ రాష్ట్ర నాయకత్వం కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర రిజర్వాయర్‌ ను పరిశీలించారు.ఈ సందర్భంగా రామక్రిష్ణ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు సక్రమంగా నిధులు కేటాయించడం లేదని తద్వారా ఏ ఒక్క ప్రాజెక్టుపనులు పూర్తి కావడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందేగాని నిధులు కేటాయించకుండా జాప్యం చేస్తోందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడికక్కడ పనులు ఆగిపోయి నిర్వాసితులకు సైతం పరిహారం అందలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలదన్నట్టుగా గరుచుట్టు మీద రోకలి పోటులా కేంద్ర ప్రభుత్వం అప్పర్‌ భద్రా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు 5,300 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఆంధ్ర ప్రదేశ్‌కు ద్రోహం చేస్తోందని ఏకరువు పెట్టారు.అప్పర్‌ భద్రా నిర్మాణం జరిగితే ఏపిలో తాగునీరే కాకుండా లక్షల ఎకరాలకు సాగునీరు అందకుండా ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అప్పర్‌ భద్రా కు నిధులు కేటాయించి ఏపీకి అన్యాయం చేశారని బీజేపీి ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు.ఇప్పటికే రాష్ట్రానికి కేటాయించిన నీరు సక్రమంగా రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు న్యాయంగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే అప్పర్‌ భద్రా కు నిధులు కేటాయించిందని తూర్పారబట్టారు. కనీసం ఇప్పటి వరకు పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన నిధులు సైతం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర త్రాగునీరు, సాగునీటి ప్రాజెక్టులపై చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ సీపీఐ రాష్ట్ర నాయకత్వ బృందం తుంగభద్ర డ్యాం నుండి శ్రీకాకుళం పలాస నీటి ప్రాజెక్టు వరకు అన్ని ప్రాజెక్టులను 8 రోజులపాటు పరిశీలిస్తామన్నారు.అనంతరం ప్రాజెక్టుల వారీగా నివేదికలు తయారు చేసి అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో చర్చిస్తామన్నారు.అనంతరం నీటి ప్రాజెక్టులన్ని పునరుద్ధరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. అనేక సందర్భాల్లో వేలాది టిఎంసి ల నీరు వృధాగా సముద్రంలో కలసి పోతుందని ఇంతజరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్‌, ఓబులేసు, ఈశ్వరయ్య, జంగాల అజయ్‌ కుమార్‌, అక్కినేని వనజ, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్‌ బాబు, చేతివృత్తి దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు,సిపిఐ అనంతపురం జిల్లా కార్యదర్శి జాఫర్‌, పుట్టపర్తి సత్య సాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌,కర్నూలు జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు, అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శుకు నారాయణస్వామి ,మల్లికార్జున కార్యవర్గ సభ్యులు రాజారెడ్డి,సంజీవప్ప, కేశవరెడ్డి, శ్రీరాములు, లింగమయ్య,రామకృష్ణ,రమ, రాజేష్‌ గౌడ్‌,రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటమయ్య,నాయకులు రాధాకృష్ణ,సుంకయ్య, రంగన్న, రాధాకృష్ణ,ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సమైఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు సీపీఐ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img