Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గ్యాస్ ధరలను పెంచి పేద ప్రజల పొట్ట కొడితే అథోగతే

సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున

విశాలాంధ్ర- రాప్తాడు: వంట గ్యాస్ ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల పొట్ట కొడితే ఏ ప్రభుత్వానికైనా అథోగతేనని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున హెచ్చరించారు. గ్యాస్ ధరలు పెంచడంపై శుక్రవారం రాప్తాడులో గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. మల్లికార్జున మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గ్యాస్ ధర పెంచి ప్రజలపై గుదిబండ మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు చేశారు. 2014లో రూ.475 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1155 కు చేరుకుందని, దీంతో సామాన్య ప్రజలు జీవనం సాగించలేని పరిస్థితి నెలకొందన్నారు. వాణిజ్య సిలిండర్ ధరపై రూ.350 డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.55 పెంచడం దారుణమని మండిపడ్డారు. వినియోగదారులపై ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, గ్యాస్ ధరలు మరింత పెంచి అధిక భారాన్ని వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ వల్ల గృహ వినియోగదారులు, పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు…ఇలా సామాన్య మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని హితవు పలికారు. పక్క రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ ధర పెంచకుండా ఎన్నికలు ముగిసిన వెంటనే అమాంతంగా పెంచడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని, అదేవిధంగా నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకుంటే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, రూరల్ మండల కార్యదర్శి మేకల రమేష్, ఏఐవైఎఫ్ ధనుంజయ, మహిళా సమాఖ్య కార్యదర్శి శారద, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రాము, రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి వెంకటనారాయణ, ఏఐ టీయూసీ రాజు, రైతు సంఘం నగేష్, నాయకులు చలపతి, మౌలాలి, బాషా, రసూల్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img