Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పేద మహిళా రోగికి కిమ్స్‌ సవీరా ఆస్పత్రిలో ఉచితంగా డ్యూయల్‌ ఛాంబర్‌ పేస్‌ మేకర్‌ అమరిక

నిమిషానికి 30 సార్లే కొట్టుకుంటున్న గుండె
ఆరోగ్యశ్రీలో ఈ సంవత్సరమే చేరిన చికిత్స
విశాలాంధ్ర-అనంతపురం వైద్యం :
తీవ్రమైన గుండె వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళకు అనంతపురంలోని కిమ్స్‌ సవీరా ఆస్పత్రి వైద్యులు ఉచితంగా డ్యూయల్‌ ఛాంబర్‌ పేస్‌మేకర్‌ అమర్చి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన సీనియర్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ మూడే సందీప్‌ తెలిపారు. ‘‘అనంతపురానికి చెందిన సుమారు 50 ఏళ్ల మహిళ విపరీతంగా చెమట పట్టడం, కళ్లు తిరగడం, బీపీ అసలు రికార్డు కాకపోవడం లాంటి సమస్యలతో ఆస్పత్రికి వచ్చారు. ఆమె గుండె వేగం పరీక్షిస్తే నిమిషానికే 30 సార్లే కొట్టుకుంటోంది. సాధారణంగా 60 నుంచి 72 సార్లు ఉండాలి. దాంతో ముందుగా గుండెలోపల వైర్లు పెట్టి, తాత్కాలిక పేస్‌ మేకర్‌తో గుండె వేగాన్ని పునరుద్ధరించాం. ఆమెకు సిక్‌ సైనస్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధి వల్ల గుండెలోని కండక్షన్‌ సిస్టం దెబ్బతినడం వల్ల ఇలా జరిగినట్లు గుర్తించాం. కొంతమందిలో వయసు కారణంగా ఇలా జరుగుతుంది. ఈమెకు సింగిల్‌ ఛాంబర్‌ పేస్‌మేకర్‌ వల్ల ఉపయోగం లేదని గుర్తించి, డ్యూయల్‌ ఛాంబర్‌ పేస్‌మేకర్‌ అమర్చాం. సాధారణంగా మెట్రో నగరాల్లో అయితే రూ.5 లక్షల వరకు అయ్యే ఈ చికిత్సను ఈ సంవత్సరమే కొత్తగా ఆరోగ్యశ్రీలో చేర్చడంతో, ఆమెకు ఈ పథకం కింద పూర్తి ఉచితంగా ఈ పరికరాన్ని అమర్చాం. ఇందులో భాగంగా గుండెలోని రెండు గదుల్లో కరెంటు తీగలు అమర్చాం. అవి బయట పెట్టే ఒక బ్యాటరీకి అనుసంధానం అయి ఉంటాయి. అది గుండె వేగాన్ని నియంత్రిస్తుంది. వేగం తగ్గితే పెంచుతుంది, పెరిగితే తగ్గిస్తుంది. జీవితాంతం వాళ్లు దాంతోనే బతకాలి. అది లేకుండా జీవించలేరు. పేద రోగి కావడం, అసలు సమస్య ఏంటో కూడా తెలియని సమయంలో ఆమెకు ఉచితంగా ఇలాంటి పెద్ద చికిత్స అందించడం గమనార్హం.
ఎవరికైనా చెమట ఎక్కువగా పడుతూ, కళ్లు తిరుగుతూ, నీరసంగా అనిపించి, గుండె దడ వస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. పల్స్‌ ఆక్సీమీటర్‌తో చూసినా, ఈసీజీ తీయించుకున్నా గుండె వేగం తెలుస్తుంది. ఒకవేళ అది 50 కంటే తక్కువగా ఉంటే వెంటనే గుండె వైద్య నిపుణులను సంప్రదించాలి. అలా అయితే అత్యవసరంగా, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆస్పత్రికి రావాల్సిన అవసరం ఉండదు అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img